దేశంలో కుటుంబ ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. ఇంటిల్లి పాది ఆత్మహత్యకు పాల్పడుతున్న సంఘటనలు ఒకటి వెంట మరొకటి వెలుగు చూస్తున్నాయి. ఆర్థిక కష్టాల కారణంగా కొందరు, మనస్పర్థలు కారణంగా మరికొందరు అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారు. ఈ తరహా ఘటన మరొకటి వెలుగుచూసింది. భీమా నది ఒడ్డున ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి. ఇందులో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు. ఇది ఆత్మహత్యగా పోలీసులు అనుమానిస్తున్నారు.
పూణె సమీపంలోని భీమా నదీ తీరంలో మృతదేహాలు ఉన్నట్లుగా సోమవారం పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు అక్కడికి వెళ్లి పరిశీలించగా నాలుగు మృతదేహాలు తేలుతూ కనిపించాయి. అనంతరం మంగళవారం మరో మూడు మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతుల్లో పెద్ద వయసు దంపతులు, వారి కుమార్తె, అల్లుడు, వారి ముగ్గురు మనవళ్లు ఉన్నట్టు పోలీసులు తెలిపారు. మృతులను మోహన్ ఉత్తమ్ పవార్, సంగీతా మోహన్ పవార్, శ్యాంరావ్ పండిట్ ఫుల్‌వారే, రాణి శ్యాంరావ్ ఫుల్‌వారే, రితేష్ శ్యాంరావ్ ఫుల్‌వారే, ఛోటూ ఫుల్‌వారే, కృష్ణగా గుర్తించారు.
వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా పోలీసులు అనుమానిస్తున్నారు. పూణెకు 45 కిలోమీటర్ల దూరంలో భీమా నదిపై ఉన్న పార్గావ్ వంతెన వద్ద వీరి మృతదేహాలు లభ్యమైనట్టు పోలీసులు తెలిపారు. వీరి ఒంటిపై ఎలాంటి గాయాలు లేకపోవడంతో ఆత్మహత్యగా భావిస్తున్నారు. అయితే, హత్య కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. వీరంతా మతి వాడర్ వర్గానికి చెందిన సంచార కుటుంబం అని తేలింది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Maharashtra | Bodies of 7 members of a family fished out from Bhima river in Daund, Pune – 4 bodies recovered b/w 18-21 Jan & 3 others found today. Prima facie it’s a suicide, however, police are investigating from all angles. Accidental Death Report registered: Pune Rural Police pic.twitter.com/XGkGguV6zV
— Economic Times (@EconomicTimes) January 24, 2023