ఏదైన దొంగతనం చేసి ముఖ్యంగా పోలీసులకు చిక్కకుండా దొంగలు రకరకాలు తెలివి తేటలు ఉపయోగిస్తు దొరకకుండా తిరుగుతూ ఉంటారు. కానీ గుంటూరు జిల్లాలో ఓ దొంగ మాత్రం పోలీసుల ముందే ఉండి ముప్పుతిప్పలు పెడుతూ చుక్కలు చూపించాడు. పోలీసుల ముందే ఉండే ముప్పుతిప్పలు పెట్టడమేంటి అని అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ పూర్తిగా చదవాల్సిందే.
ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గుంటూరు జిల్లా తెనాలిలోని ఐతానగర్‌లో భరత్ అనే వ్యక్తి ఇంట్లో దొంగతనం చేస్తూ బాధిత కంట పడ్డాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఇక విషయం తెలుసుకున్న పోలీసులు పరుగు పరుగున ఐతానగర్‌లో వాలిపోయారు. ఇక దొంగతనం చేసిన మనోడు పోలీసులను చూసి గ్రామం నుంచి పరారయ్యేందుకు ప్రయత్నాలు చేశాడు. పోలీసులు కూడా అతడి వెంటనే పరుగులు పెట్టారు. ఇక వెంటనే ఆ ఘరానా మోసగాడు గ్రామ సమీపంలోని చెరువులోకి దూకాడు.
ఇక ఆ గ్రామంలోని ప్రజలంతా ఆ చెరువు వద్దకి చేరుకుని సినిమా చూసినట్లు చూశారు. ఇక చెరువులోకి దిగిన మనోడు ఎప్పుడు బయటకు వస్తాడా ఎప్పుడు పట్టుకుందామా అని పోలీసులు ఎదురు చూస్తున్నారు. కానీ మనోడు ఎంతకు కూడా చెరువులోని నుంచి బయటకు రాలేదు. అలా గంట కాదు, రెండు గంటలు కాదు ఏకంగ 6 గంటల పాటు చెరువులోనే ఈదుతూ పోలీసులకే చుక్కలు చూపించాడు. ఇక ఎంతకు బయటకు రాకపోవటంతో పోలీసులు కూడా చూసి చూసి అలసి పోయారు. దీంతో ఈ క్రమంలోనే ఈ గజదొంగ పోలీసుల కళ్లు గప్పి చెరువు నుంచి పరారయ్యాడు. సినిమా స్టోరీని తల దన్నేలా ఉన్న ఈ రియల్ స్టోరీలో పోలీసులు దొంగను పట్టుకోవడంలో మాత్రం విఫలమయ్యారు.