గతంతో పోల్చుకుంటే ఈ మధ్య కాలంలో దొంగ నోట్ల హవా బాగా తగ్గింది. అయినప్పటికీ అక్కడక్కడా దొంగ నోట్లు వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఏకంగా ఏటీఎమ్ మిషిన్ల నుంచే దొంగ నోట్లు వస్తున్నాయి. తాజాగా, ఉత్తర ప్రదేశ్‌లోని ఓ ఏటీఎమ్ సెంటర్‌లోని మిషిన్ నుంచి దొంగ 200 రూపాయల నోట్లు వచ్చాయి. వాటిపై ‘ఫుల్ ఆఫ్ ఫన్’ అని రాసి ఉంది. దీంతో డబ్బులు డ్రా చేసుకున్న ఖాతాదారుడు ఖంగుతిన్నాడు. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఉత్తర ప్రదేశ్, అమేథీ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి దీపావళి షాపింగ్ కోసం బయటకు వెళ్లాడు. చేతిలో డబ్బులు లేకపోవటంతో ఓ ఏటీఎమ్ సెంటర్‌కు వెళ్లాడు. తన ఖాతాలోంచి ఓ ఐదు వేల రూపాయలు విత్ డ్రా చేశాడు.
ఆ తర్వాత డబ్బుల్ని లెక్కపెడుతుండగా కొన్ని 200 రూపాయల నోట్లు అనుమానంగా కనిపించాయి. అతడు వాటిని పరీక్షించి చూశాడు. ఇక, అసలు విషయం అర్థమై షాక్ తిన్నాడు. అవి దొంగ నోట్లని గుర్తించాడు. ఆ నోటుపై ఇంగ్లీష్‌లో ‘ ఫుల్ ఆఫ్ ఫన్’ అని రాసింది. సదరు వ్యక్తి చేసేదేమీ లేక ఏడుపు ముఖంతో పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. జరిగిన విషయాన్ని వారికి వివరించి చెప్పాడు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆ దొంగ నోట్లు అక్కడికి ఎలా వచ్చాయో ఆరా తీస్తున్నారు.
ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘‘ ఈ వీడియో చూసిన తర్వాత భయం పట్టుకుంది. ఏటీఎమ్‌లో దొంగ నోట్లు రావటం ఏంటి’’.. ‘‘ ఆ దొంగ నోట్లు వస్తే మనకు ‘‘ ఫుల్ ఆఫ్ ఫన్’’.. ‘‘ ఏటీఎమ్ టెక్నికల్ టీంలోని వారే ఇలా చేసి ఉండొచ్చు’’.. ‘‘ ఆ నోటు అచ్చం నిజందిలాగే ఉంది. ఆ అక్షరాలు లేకపోతే తేడా తెలీదు’’.. ‘‘ నోట్ల రద్దు తర్వాత దొంగనోట్లు లేకుండా పోవాలి. కానీ, అలా జరగలేదు’’ అని కామెంట్లు చేస్తున్నారు.
ATM In UP’s Amethi Dispenses Fake Rs 200 Notes. Watch for more details.#TNShorts #ViralVideo #UP #Amethi pic.twitter.com/IvYYpbmg7w
— TIMES NOW (@TimesNow) October 27, 2022