ప్రేమంటే ఇవ్వటమే.. ఇచ్చిన దాన్ని తిరిగి ఆశించటం కాదు. ఈ అక్షర సత్యాన్ని కొందరు గుర్తించలేకపోతున్నారు. తమ స్వార్థాలకు ప్రేమ అన్న పేరు పెట్టి నానా అరాచకాలకు పాల్పడుతున్నారు. ప్రతీ రోజు ప్రపంచంలోని ఏదో ఒక మూల మహిళలపై ప్రేమ పేరుతో మగాళ్లు దాడులు చేస్తున్నారు. తమను దూరం పెడుతున్నందుకు ప్రాణాలు తీస్తున్నారు. ఓ వ్యక్తి తనను కాదని దూరంగా ఉంటున్న ఓ యువతిపై దారుణానికి పాల్పడ్డాడు. బస్టాండ్‌లో బస్ కోసం ఎదురు చూస్తున్న ఆమెపై తుపాకితో కాల్పులు జరిపి చంపేశాడు. ఈ సంఘటన బ్రెజిల్లో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బ్రెజిల్, సావో పాలో సిటీకి చెందిన 20 ఏళ్ల జెన్నిఫర్ క్రిస్టినా దాస్ శాంతోస్ మోరైరా అదే ప్రాంతానికి చెందిన అలెస్సాండ్రీ గార్సియా డా సిల్వ అనే 35 ఏళ్ల వ్యక్తి కొన్నేళ్ల క్రితం ప్రేమలో పడ్డారు.
చాలా కాలం కలిసి ఉన్నారు. రిలేషన్‌షిప్‌లోకి దిగిన కొన్ని నెలల వరకు బాగానే గడిచింది. ఆ తర్వాతి నుంచే జెన్నిఫర్‌కు వేధింపులు మొదలయ్యాయి. అలెస్సాండ్రీ తరచుగా ఆమెపై చెయ్యి చేసుకునేవాడు. ఓ పాప పుట్టిన తర్వాత కూడా అతడి వేధింపులు ఆగలేదు. దీంతో తమ బంధానికి ఆమె ముగింపు పలికింది. అతడితో విడిపోయి వేరుగా ఉండటం మొదలుపెట్టింది. అయితే, జెన్నీఫర్ తనకు దూరం అవ్వటం అలెస్సాండ్రీ తట్టుకోలేకపోయాడు. ఆమెను ఎలాగైనా వెనక్కు రప్పించాలని చూశాడు. పలు రకాలుగా భయపెట్టడం మొదలుపెట్టాడు. ఆఖరికి ఇద్దరికీ పుట్టిన పాపను కూడా చంపుతానని బెదిరించాడు. అయినా ఆమె అతడికి లొంగలేదు. దీంతో అతడి కోపం మరింత పెరిగింది.
తనకు దక్కని ఆమెను అంతం చేయాలనుకున్నాడు. అక్టోబర్ 20న ఉదయం ఆఫీసుకు వెళ్లటానికి జెన్నీఫర్ బస్టాండ్‌కు వెళ్లింది. అక్కడే తన ఆఫీస్ మిత్రులతో కలిసి బస్ కోసం ఎదురు చూడసాగింది. ఈ నేపథ్యంలోనే అలెస్సాండ్రీ అక్కడికి వచ్చాడు. జెన్నీఫర్‌కు దగ్గరగా వెళ్లి తుపాకితో ఆమెపై కాల్పులు జరిపాడు. మొత్తం ఐదు బుల్లెట్లు ఆమె శరీరంలోకి కాల్చాడు. అనంతరం అక్కడినుంచి పరారయ్యాడు. తీవ్ర గాయాలపాలైన ఆమెను అక్కడి వారు ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ జెన్నీఫర్ కన్నుమూసింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుడ్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.