నాయక్ సినిమా చూసిన వారికి అందులో పిల్లల బెగ్గింగ్ సీన్ గుర్తుండే ఉంటుంది. ఆ సీన్లో ఓ గ్యాంగ్ చిన్న పిల్లల్ని హింసించి వారిని భిక్షాటనలోకి దించుతుంటారు. కళ్లు, కాళ్లు ఇలా ఏదో ఒక అవిటితనాన్ని సృష్టించి వారిని అడుక్కుతినేలా చేస్తుంటారు. వారు తెచ్చిన డబ్బుల్ని గ్యాంగ్ తీసుకుంటూ ఉంటుంది. అచ్చం ఇలాంటి సంఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. ఓ గ్యాంగ్ ఏకంగా 26 ఏళ్ల వ్యక్తిపై దారుణానికి ఒడిగట్టింది. అతడ్ని అంధుడ్ని చేసి, భిక్షాటనలోకి దించింది. ఆరు నెలల తర్వాత అతడు తప్పించుకుని ఇంటికి వచ్చాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బిహార్‌కు చెందిన సురేష్ మంజీ అనే 26 ఏళ్ల వ్యక్తి సోదరుడితో కలిసి కాన్పూర్‌లో ఉండేవాడు. ఆరు నెలల క్రితం ఉద్యోగ అన్వేషణ కోసం ఢిల్లీ వెళ్లాడు.
ఆ తర్వాతి నుంచి కనిపించకుండా పోయాడు. సోదరుడు ఎంత ప్రయత్నించినా సురేష్ ఆచూకీ కనుక్కోలేకపోయాడు. 6 నెలలు గడిచాయి. శుక్రవారం సురేష్ సోదరుడి దగ్గరకు వచ్చాడు. అతడ్ని చూసిన సోదరుడు షాక్ అయ్యాడు. సురేష్ శరీరం నిండా గాయాలు ఉన్నాయి. ఓ కన్ను కూడా పూర్తిగా పాడైపోయింది. సోదరుడు ఏం జరిగిందని సురేష్‌ను అడిగాడు. అతడు చెప్పింది విని నిర్ఘాంతపోయాడు. అనంతరం ఇద్దరూ పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. విజయ్ అనే వ్యక్తిపై ఫిర్యాదు చేశాడు. తన కంప్లైంట్లో ‘‘ విజయ్ అనే వ్యక్తి నన్ను ఉద్యోగం కోసం నన్ను కన్పూర్లోనే ఉన్న ఓ మహిళ ఇంటికి తీసుకెళ్లాడు.
అక్కడ నన్ను దారుణంగా హింసించాడు. నా కంటిలోకి రసాయనాన్ని ఎక్కించాడు. నా కన్ను పూర్తిగా పాడైంది. తర్వాత నన్ను రాజ్ అనే బెగ్గింగ్ మాఫియా లీడర్‌కు అమ్మాడు. తర్వాత ఢిల్లీనుంచి హర్యానాకు పంపారు. అక్కడ నన్ను భిక్షాటనలోకి దింపారు. భిక్షాటన చేయకపోతే దారుణంగా కొట్టే వారు. అన్నం కూడా పెట్టే వారు కాదు. మత్తు మందుల కారణంగా నా ఆరోగ్యం దెబ్బతింది. దీంతో నన్ను కాన్పూర్‌కు తీసుకువచ్చారు. అక్కడ కూడా నన్ను భిక్షాటనలో దింపారు. గురువారం నేను వారి దగ్గరినుంచి తప్పించుకుని పారిపోయి వచ్చాను’’ అని ఆవేదన వ్యక్తం చేశాడు.