ఎంతో కష్టపడి కుమారుడిని చదివించారు. అతడు కూడా తల్లిదండ్రులు తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టేందుకు కష్టపడి చదివి ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాడు. ఇక కుమారుడికి పెళ్లి చేస్తే.. తమ బాధ్యత తీరుతుందని భావించిన తల్లిదండ్రులు మూడు రోజుల క్రితమే అతడికి సంబంధం చూశారు. అయితే దురదృష్టం వారిని వెంటాడింది. మరి కొన్ని రోజుల్లో పెళ్లి బాజాలు మోగాల్సిన ఇంట్లో.. విషాద ఛాయలు అలుముకున్నాయి. పెళ్లి పీటలు ఎక్కాల్సిన కుమారుడు.. పాడెనెక్కాడు. చెట్టంత బిడ్డ కళ్ల ముందే చనిపోవడంతో.. ఇక ఆ తల్లిదండ్రులను ఓదార్చడం ఎవరి వల్ల కావడం లేదు. ఆ వివరాలు.
ఈ విషాదకర సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటు చేసుకుంది. కాచనపల్లి పోలీస్స్టేషన్లో సంతోష్ అనే వ్యక్తి హెడికానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నాడు. నైట్ డ్యూటీలో ఉన్న సంతోష్ తెల్లవారుజామున ఆయుధాలను పరిశీలిస్తుండగా తుపాకీ మిస్ ఫైర్ కావడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. ఆయుధాలను పరిశీలిస్తుండగా ప్రమాదవశాత్తు ఘటన జరిగిందని ఉన్నతాధికారులు తెలిపారు. సంతోష్ మృతదేహాన్ని ఇల్లందు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపడుతున్నారు.
ఇక, మృతుడు సంతోష్ స్వస్థలం వరంగల్ జిల్లా గవిచర్ల. ప్రస్తుతం కాచనపల్లి పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నారు. మూడు రోజుల క్రితమే సంతోష్ కుటుంబ సభ్యులు అతడికి పెళ్లి సంబంధం చూసినట్టుగా తెలుస్తోంది. త్వరలోనే పెళ్లి చేయాలని భావిస్తున్నారు. ఆలోపే ఈ ఘటన చోటుచేసుకోవడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఈ విషాద సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.