ఏపీ రాజకీయాల్లో కొన్ని రోజుల నుంచి ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అనూహ్యంగా కొందరు తెర మీదకు వస్తున్నారు. కొన్ని రోజుల క్రితం టాలీవుడ్ సినీ సమస్య పరిష్కారానికి గాను చిరంజీవితో పాటు మరి కొంత మంది సినీ ప్రముఖలు సీఎం జగన్ తో భేటీ అయ్యారు. ఇండస్ట్రీ తరఫున వెళ్లిన వారిలో అలీ కూడా ఉండటం ఆశ్చర్యం కలిగించింది. అయితే తను మొదటి నుంచి వైసీపీకి అనుకూలంగా ఉండటంతోనే భేటీకి ఆహ్వానం అందిందనే వార్తలు వినిపించాయి. అదే రోజు సీఎం జగన్ వారం రోజుల తర్వాత మళ్లీ కలుద్దాం అని అలీని ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అలీకి రాజ్యసభ సీటు ఇస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ సంవత్సరమే రాష్ట్రం నుంచి ఏకంగా నాలుగు రాజ్య సభ స్థానాలు ఖాళీ కానున్నాయి. ఈ క్రమంలో అలీకి అవకాశం ఇస్తారని సమాచారం.
ఈ వార్తలకు తగ్గట్లుగానే అలీ మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు సీఎం క్యాంపు ఆఫీస్ లో జగన్ ని కలిశారు. భేటీ అనంతరం అలీ మీడియాతో మాట్లాడారు. ‘‘వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబంతో నాకు ఎప్పటి నుంచో పరిచయం ఉంది. జగన్ సీఎం కావడంతో కలవడానికి పెద్దగా సమయం దొరకలేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లోనే నాకు ఎమ్మెల్యే టికెట్ ఆఫర్ చేశారు. కానీ నేను వద్దునుకున్నాను. త్వరలో నా పదవిపై పార్టీ ఆఫీస్ నుంచి ప్రకటన వస్తుంది. రెండు వారాల్లోనే ప్రకటన ఉంటుంది అనుకుంటున్నాను. ఇక రాజ్యసభ సీటుపై నాకు ఎలాంటి సంకేతాలు లేవు’’ అని అలీ తెలిపారు.