కష్టం అంటూ తన దృష్టికి వస్తే.. చాలు.. వెంటనే వారిని ఆదుకుంటారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. గతంలో వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్న సందర్భంలో.. ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న చిన్నారి తనను ఆదుకోవాలని కోరింది. వెంటనే స్పందించిన సీఎం జగన్ చిన్నారి వైద్యానికి కోటి రూపాయలు మంజూరు చేయాలంటూ అధికారులను ఆదేశించడం.. వారు రోజుల వ్యవధిలో ఆ మొత్తాన్ని చిన్నారికి అందిచడం చేశారు. ఈ క్రమంలో తాజాగా మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు సీఎం జగన్. ఆరుద్ర కుమార్తె వైద్యానకికి ఎంత ఖర్చయినా భరించాలంటూ అధికారులను ఆదేశించాడు. ఆ వివరాలు..
కాకినాడకు చెందిన రాజులపూడి ఆరుద్ర.. వెన్నుముక సమస్యతో బాధపడుతున్న తన కుమార్తె సాయిలక్ష్మీ చంద్రను ఆదుకోవాలంటూ రెండు రోజుల క్రితం సీఎం కార్యాలయాన్ని కోరింది. ఈ విషయం కాస్త సీఎం జగన్ దృష్టికి చేరింది. దీనిపై స్పందించిన జగన్.. చిన్నారి సాయిలక్ష్మీ చంద్ర వైద్యానికి అయ్యే పూర్తి ఖర్చును భరించాలంటూ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సీఎంఓ అధికారులు ఆరుద్రకు కాల్ చేసి మాట్లాడారు. చిన్నారి సాయిలక్ష్మీ చంద్ర వైద్యానికి అయ్యే ఖర్చును పూర్తిగా భరిస్తామని.. ఆ మేరకు సీఎం జగన్ తమకు ఆదేశాలు జారీచేశారని ధనుంజయ్ రెడ్డి తెలిపారు.
అంతేకాక వారికి జీవనోపాధి కల్పించేందుకు ఉద్యోగం కూడా ఇస్తామన్నారు. ఆరుద్ర సమక్షంలో నేరుగా కాకినాడ జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు జారీచేశారు. అలానే తనకున్న స్థిరాస్థిని అమ్ముకునేందుకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని ఈ సందర్భంగా ఆరుద్ర అధికారులను కోరింది. ఈ విషయంలో ఆరుద్రను ఇబ్బంది పెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. ప్రభుత్వం అన్నిరకాలుగా తోడుగా ఉంటుందని, ఎలాంటి నిరాశకు గురికావొద్దని, ధైర్యంగా ఉండాలని ఆరుద్రకు సీఎం కార్యదర్శి భరోసా ఇచ్చారు.
కుమార్తె వైద్యానికి అయ్యే ఖర్చు భరిస్తానంటూ అధికారులు భరోసా ఇవ్వడం పట్ల ఆరుద్ర సంతోషం వ్యక్తం చేసింది. తమలాంటి నిస్సహాయులను ఆదుకునేందుకు సీఎం జగన్ ఎన్నడు వెనకడుగు వేయలేదని తెలిపింది. జగన్ మీద ఉన్న భరోసాతోనే తాను ఇక్కడకు వచ్చానని తెలిపింది. తన కుమార్తె వైద్యానికి పూర్తి ఖర్చులను భరిస్తానన్నందుకు అధికారులకు ధన్యవాదాలు తెలిపింది. అలానే ఉపాధి కోసం ఉద్యోగం కల్పిస్తామంటూ ఇచ్చిన హామీపై ఆనందం వ్యక్తం చేసింది. రెండు రోజులుగా అధికారులు ఎప్పటికప్పుడు తన యోగక్షేమాలు కనుక్కుంటూ, పరామర్శిస్తూ బాగోగులు చూసుకున్నారని.. ఈ విషయంలో సీఎం జగన్‌కు సదా రుణపడి ఉంటానని తెలిపింది ఆరుద్ర.