యువతంటే మార్పును ఆశించే నవతరం. అవకాశాలను అందిపుచ్చుకొని భవితకు బాటలు వేసుకునే శక్తి. తలుచుకుంటే ఏదైనా సాధించగల ఆత్మవిశ్వాసం వారి సొంతం. ఇవి వారి గురుంచి చెప్పే కొటేషన్లు. వారు చేసే పనులు మాత్రం దీనికి వ్యతిరేకం. చెడు వ్యసనాలకు బానిసలై కొందరు పెడదోవ పడుతున్నారు. లక్ష్యం లేకుండా సరదాలు, సెల్‌ఫోన్లు, న్యూడ్ వీడియోలు, మందు, డ్రగ్స్‌కు అలవాటై తమ విలువైన జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. పాఠశాల స్థాయిలోనే తప్పుదారి పడుతున్నారు. ఇదిగోండి.. ఈ ఘటనే అందుకు ప్రత్యక్ష ఉదాహరణ. పాఠాలు బోధిస్తున్న ఓ మహిళా టీచర్ ని వెనుకనుండి వీడేమో తీసిన విద్యార్ధి, దానిని అశ్లీలంగా సృష్టించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాడు.
వివరాల్లోకి వెళ్తే.. పెనుగంచిప్రోలు మండలంలోని ఒక ఉన్నత పాఠశాలలో ఓ మహిళా టీచర్ విధులు నివహిస్తోంది. ఒకరోజు తరగతి గదిలో ఆమె బోర్డు వైపు తిరిగి పాఠాలు బోధిస్తుండగా, తొమ్మిదో తరగతి విద్యార్థి ఆమెను వెనుక నుంచి వీడియో తీసి, దానికి ఆశ్లీల పాట జోడించి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. గురువారం ఆ విషయం బయట కొచ్చింది. ఆ వీడియోను అప్పటికే చాలా మంది చూశారు. విషయం ఊరంతా తెలిసాక, సదరు పాఠశాల హెచ్‌ఎం వరకు చేరింది. ఈ విషయం తెలుసుకున్న హెచ్‌ఎం ఆ విద్యార్థి తండ్రిని బడికి పిలిపించి విషయాన్ని వివరించారు.
‘మీ కొడుకు ప్రవర్తిస్తున్న తీరు సరిగా లేదు.. మా పాఠశాలలో వద్దు, టీసీ తీసుకొని వెళ్లిపోండి..’ అని హెచ్‌ఎం గట్టిగా హెచ్చరించారు. ఈ ఒక్కసారికి వదిలేయండని విద్యార్థి తండ్రి ప్రాధేయపడడంతో వివాదం సద్దుమణిగింది. ఈ ఘటన పట్ల పాఠశాలలో విధులు నిర్వర్తించే మహిళా ఉపాధ్యాయినులు బోర్డు వైపు తిరిగి పాఠాలు చెప్పాలంటేనే భయపడుతున్నారు. ఒకరికి జరిగినపుడే చర్యలు తీసుకోకపోతే.. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతాయని వారు వాపోతున్నారు. తల్లిదండ్రుల పర్యవేక్షణ లేకపోవడం, పాఠశాలలు, కళాశాలలు యాజమాన్యం పట్టించుకోక పోవడంతో విద్యార్థులు ఈ విధంగా తయారవుతున్నారు. శృతిమించిన ఈ విద్యార్ధిని.. ఏ విధంగా దండించాలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.