బడుగు బలహీన వర్గాల ప్రజల సంక్షేమం కోసం తాపత్రయపడుతూ.. వారి ఆర్థిక పరిస్థితి మెరుగు పర్చడం కోసం వినూత్న సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ.. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఈ క్రమంలో తాజాగా గీత కార్మికులకు శుభవార్త చెప్పాడు సీఎం జగన్. ఐదేళ్ల పాలన కాలానికి సంబంధించి నూతన కల్లు గీత విధానం ప్రకటించింది ఏపీ ప్రభుత్వం. 2022-27 వరకు ఇది అమల్లో ఉండనుంది. దీనివల్ల రాష్ట్రంలోని 95,245 కల్లు గీత కార్మిక కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ సోమవారం మార్గదర్శకాలు జారీ చేశారు.
దీని ప్రకారం ఇక మీదట కల్లు గీస్తూ ప్రమాదవశాత్తు కింద పడి మృతి చెందిన కార్మికులకు చెల్లించే పరిహారాన్ని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచింది ప్రభుత్వం. ఈ మొత్తంలో రూ.5 లక్షలు వైఎస్సార్ బీమా ద్వారా అందజేయనుండగా.. మిగిలిన రూ.5 లక్షలు ఎక్స్గ్రేషియా రూపంలో ప్రభుత్వం చెల్లిస్తుంది. అలానే కల్లు గీస్తూ ప్రమాదానికి గురై శాశ్వత వైకల్యం పొందితే.. వారికి ప్రత్యామ్నయ నైపుణ్యాభివృద్ధి విభాగం ద్వారా శిక్షణ ఇచ్చి ఇతర ఆదాయ మార్గాలను చూపిస్తారు. అంతేకాక వైకల్యం పొందిన వారికి వైస్సార్ బీమా ద్వారా నష్టపరిహారం అందజేస్తారు. ఇక కల్లు గీత కార్మికుడు సహజ మరణం చెందితే అతని కుటుంబానికి వైఎస్సార్ బీమా పథకం ద్వారా రూ.5 లక్షల పరిహారం అందుతుందని వెల్లడించింది.
కల్లు రెంటల్స్ను ప్రభుత్వం పూర్తిగా రద్దు చేసింది. అలాగే కల్లుగీత కార్మిక సొసైటీలు, గీచే వానికి చెట్టు పథకం, షెడ్యూల్డ్ ప్రాంతాల్లో షెడ్యూల్డ్ జాతుల వారు కల్లు గీసుకోవడం కోసం ఐదేళ్లకు లైసెన్స్ ఇస్తారు. అలాగే ఎన్ఆర్ఈజీఎస్, షెల్టర్ బెడ్ అభివృద్ధి పథకాల కింద తాటి, ఈత చెట్ల పెంపకానికి చర్యలు తీసుకోనున్నారు. అలాగే కాలువ గట్లు, నదీ, సాగర తీరాలను పటిష్టం చేస్తూ కల్లు గీతకు కావాల్సిన తాటి, ఈత చెట్లను సమృద్ధిగా పెంచనున్నారు.