నేషనల్ అవార్డు విన్నర్ ధనుష్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. 3 సినిమా మొదలుకొని రఘువరన్ బిటెక్, నవమన్మధుడు, మారి, మారి 2, జగమే తంత్రం ఇలా రీసెంట్ గా మారన్, గ్రే మ్యాన్ వరకూ ధనుష్ సినిమాలను ఆదరిస్తూ వస్తున్నారు. ముఖ్యంగా రఘువరన్ బిటెక్, మారి, అసురన్, కర్ణన్ సినిమాలతో ధనుష్ క్రేజ్ తెలుగు రాష్ట్రాలలో భారీ స్థాయిలో క్రియేట్ అయ్యింది. అయితే.. కర్ణన్ తర్వాత ధనుష్ నుండి ఆ స్థాయి హిట్ సినిమాలు రాలేదని చెప్పాలి. ఇక తాజాగా 'తిరు' మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. సన్ పిక్చర్స్ వారు నిర్మించిన ఈ సినిమాను మిత్రన్ ఆర్ జవహర్ తెరకెక్కించారు. మరి మినిమమ్ అంచనాలతో విడుదలైన ఈ సినిమా ధనుష్ కి హిట్ ఇచ్చిందా లేదా రివ్యూలో చూద్దాం! కథ: తిరు ఏకాంబరం(ధనుష్) అలియాస్ పండు ఫుడ్ డెలివరీ బాయ్. చిన్నప్పుడు బాగా తెలివైన కుర్రాడే.. కానీ కాలేజీలో జరిగిన ఓ సంఘటన కారణంగా మధ్యలోనే చదువు మానేస్తాడు. అప్పటినుండి భయం భయంగా తండ్రి(ప్రకాష్ రాజ్), తాత (భారతీరాజా)లతో కలిసి బ్రతుకుంటాడు. ఈ క్రమంలో తిరు చిన్నప్పటి స్నేహితురాలు శోభన(నిత్యామీనన్) ఎదురై.. తిరు లవ్ స్టోరీస్(రాశిఖన్నా, ప్రియభవాని)లో హెల్ప్ చేసే ప్రయత్నం చేస్తుంది. మరి చివరికి తిరు ప్రేమను ఎవరు అంగీకరించారు? తిరు డెలివరీ బాయ్ గా ఎందుకు మారాడు? అతనిలో దాగి ఉన్న భయం ఏంటి? శోభన వచ్చాక తిరు లైఫ్ ఎలాంటి టర్న్ తీసుకుంది? అనేది తెరపై చూడాల్సిందే. విశ్లేషణ: సాధారణంగా ధనుష్ సినిమాలకు హైప్ లేకపోయినా ఓ మోస్తరు అంచనాలైతే ఉంటాయి. ఎందుకంటే.. ఇదివరకే ధనుష్ నుండి 3, రఘువరన్ బిటెక్, అసురన్, కర్ణన్, మారి లాంటి బ్లాక్ బస్టర్ పెర్ఫార్మన్స్ లు చూశాం. అయితే.. మొన్నటివరకూ ధనుష్ సినిమాలన్నీ భారీ హైప్ తో రిలీజై బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. అదీగాక ఇటీవలే 'ది గ్రే మ్యాన్' మూవీతో ధనుష్ హాలీవుడ్ లో అడుగుపెట్టాడు. దీంతో ధనుష్ సినిమా అంటే అన్ని వర్గాలలో అంచనాలు ఏర్పడుతుంటాయి. అయితే.. తీరు సినిమా విషయానికి వస్తే.. రిలీజ్ వరకు 'తిరు' అనే సినిమా ఉందని.. అదికూడా ధనుష్ సినిమా అని ప్రేక్షకులకు తెలియదు. ప్రమోషన్స్ విషయంలో తిరు సినిమా హైప్ లేదని చెప్పాలి. అయితే.. ఈ సినిమాను సన్ పిక్చర్స్ అధినేత కళానిధి మారన్ నిర్మించడం, సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ సంగీతం అందించడంతో సినిమాపై కాస్తోకూస్తో ఆసక్తి ఏర్పడింది. అందులోను నిత్యామీనన్, రాశిఖన్నా, ప్రియభవాని శంకర్ హీరోయిన్స్ గా నటించడం మరో విశేషం. ఇక ధనుష్.. దర్శకుడు మిత్రన్ ఆర్ జవహర్ కాంబినేషన్ లో వచ్చిన నాలుగో సినిమా ఇది. ఇదివరకే వీరి కాంబోలో యారడి నీ మోహిని, కుట్టి, ఉత్తమపుత్రన్ రీమేక్ అయ్యాయి. ఇక తిరు సినిమా విషయానికి వస్తే.. కథాకథనాలు కొత్త కాదు. ఓ మధ్యతరగతి యువకుడి లైఫ్ స్ట్రగుల్స్, లవ్ స్టోరీ, ఫ్రెండ్ షిప్.. చివరిగా ఫ్యామిలీ వాతావరణం.. ఇలా ఒక్కో దశను పరిచయం చేస్తూ సినిమాలోకి తీసుకెళ్లాడు దర్శకుడు. మధ్యతరగతి యువకుడు పండు క్యారెక్టర్ లో ధనుష్ ఎంట్రీ.. యూత్ కి బాగా కనెక్ట్ అవుతుంది. ఇక అతని పోలీస్ తండ్రి ప్రకాష్ రాజ్, తాత సీనియర్ పండు క్యారెక్టర్ లో భారతీరాజా మెప్పించారు. ముందుగా ఈ ముగ్గురి ఫ్యామిలీ లైఫ్ ఎమోషనల్ గా దగ్గర చేస్తుంది. అయితే.. ఇలాంటి ఫ్యామిలీ సీన్స్ ఇదివరకే చూసిన ఫీల్ రాకుండా.. ఎమోషన్స్ తో లింక్ చేశాడు దర్శకుడు. మామూలుగా ధనుష్ సోదరుడు దర్శకుడు సెల్వరాఘవన్ సినిమాల తాలూకు పోలికలు, ఎమోషన్స్ కనిపిస్తుంటాయి. 7/జి బృందావన్ కాలనీ, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే ఎమోషన్స్ ఎదురవుతుంటాయి. ముఖ్యంగా ఫ్రెండ్ శోభన క్యారక్టర్ లో నిత్యామీనన్.. సపోర్ట్ చేసిన విధానం.. అలాగే పండుని మోటివేట్ చేసే అంశాలు బృందావన్ కాలనీలో సోనియా క్యారెక్టర్ ని గుర్తు చేస్తుంది. అలాగే ఇద్దరి మధ్య బాండింగ్ చాలా బాగా చూపించారు. ఇక ధనుష్ ఇష్టపడిన అమ్మాయిలు అనూష(రాశిఖన్నా, రంజని(ప్రియా భవాని) పాత్రలు ఆకట్టుకుంటాయి. అలా పండు లైఫ్ లో ఒక్కో ఎమోషన్ ని జోడిస్తూ.. సెకండాఫ్ లో పండు క్యారెక్టర్ ని ఎలివేట్ చేసి, మోటివేట్ చేసిన విధానం నచ్చుతుంది. ముఖ్యంగా సినిమాలో ధనుష్, నిత్యామీనన్ వారి పాత్రలకు వందశాతం న్యాయం చేశారు. ఇక తండ్రి ప్రకాష్ రాజ్, తాత భారతీరాజా పాత్రలు ఎమోషనల్ గా టచ్ అవుతాయి. ఇక చివరికి పండు లైఫ్ ఎలా టర్న్ అయ్యిందనే విషయాన్నీ కొత్తగా చెప్పాలని అనుకున్నారు. కానీ.. స్క్రీన్ ప్లేలో ఆ మ్యాజిక్ జనరేట్ అవ్వలేదని అనిపిస్తుంది. బట్ సీట్ లో నుండి కదలకుండా చేసిన క్రెడిట్ సినిమా లెన్త్ కి, మ్యూజిక్ డైరెక్టర్ కే దక్కుతుంది. ఈ సినిమాకి ప్రధాన బలం అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్. వీరి కాంబినేషన్ లో ఇది నాలుగో సినిమా. అయితే.. పాటలు బాగున్నప్పటికీ, డబ్బింగ్ పాటలు కదా అని గుర్తుకు వస్తుంటుంది. కానీ.. విన్నంత వరకు బాగానే అనిపిస్తాయి. ఇక బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం అనిరుధ్ స్ట్రాంగ్ గా ఇచ్చాడు. అక్కడక్కడా రఘువరన్ బిటెక్ స్టైల్ కనిపిస్తుంది. బట్ ఫ్లోలో అవేవి గుర్తురావు. ఓం ప్రకాష్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఎమోషన్స్, లొకేషన్స్ ని బాగా క్యాచ్ చేశాడు. సన్ పిక్చర్స్ వారి నిర్మాణ విలువలు బాగున్నాయి. చివరిగా బలమైన కథాకథనాలతో పోటీగా ఏ సినిమా లేకపోతే.. ఈ వారానికి తిరునే విన్నర్ అయ్యే అవకాశం ఉంది. ప్లస్ లు: ప్రధాన నటీనటులు మ్యూజిక్ సినిమాటోగ్రఫీ ఎమోషన్స్, మూవీ లెన్త్ మైనస్ లు: కొన్నిచోట్ల రొటీన్ సీన్స్ కథనం చివరిమాట: తిరు.. ఎమోషనల్ గా మెప్పిస్తాడు! రేటింగ్: 2.5/5