ఈరోజుల్లో డెబిట్ కార్డును ఉపయోగించే వారి కంటే క్రెడిట్ కార్డును వాడుతున్న వారి సంఖ్యే అధికం. అయితే.. క్రెడిట్ కార్డును వాడటం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో.. అంతకు మించి నష్టాలు కూడా ఉన్నాయి. వినియోగదారులు.. అలా నష్టాల బారిన పడకుండా ఎప్పటికప్పుడు కొత్త నిబంధనలు తీసుకొస్తున్న ఆర్బీఐ.. మరిన్ని కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. క్రెడిట్ కార్డు -బిల్ స్టేట్ మెంట్, పిర్యాదుల పరిష్కారం, బిల్లింగ్ సైకిల్లో మార్పులు, క్రెడిట్ కార్డు క్లోజింగ్ కు సంబంధించి కొన్ని కీలక మార్పులు చేసింది. జూలై 1, 2022 నుంచి ఈ రూల్స్ అమల్లోకి వచ్చాయి. కొత్త రూల్స్: క్రెడిట్ కార్డ్ బిల్లులో ఏదైనా తప్పుగా ఉంటే వినియోగదారుడు బ్యాంకుకి ఫిర్యాదు చేయవచ్చు. ఆ సమయంలో బ్యాంకు కార్డ్ హోల్డర్ ఫిర్యాదు చేసిన 30 రోజుల్లోగా వివరణ ఇవ్వాలి. బిల్లులు, స్టేట్‌మెంట్‌లను పంపడం, ఈ మెయిల్ చేయడంలో ఎలాంటి జాప్యం జరగకుండా చూడాల్సిన బాధ్యత బ్యాంకులపై ఉంది. అంతేకాకుండా కార్డుదారులకు తగినంత సమయం ఇవ్వాలి. అప్పుడే వారు వడ్డీ లేకుండా చెల్లింపులు చేసే అవకాశాలు ఉంటాయి. కార్డు వినియోగదారులు కార్డును రద్దు చేయాలని కోరితే.. బ్యాంకులు ఏడు రోజుల్లోగా ఆ ప్రక్రియను పూర్తి చేయాలి. ఒక వేళ బ్యాంకులు ఏదైనా జాప్యం చేస్తే కంపెనీకి రోజుకు రూ. 500 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అలాగే.. కార్డు క్లోజ్ అయిన తర్వాత కార్డ్ హోల్డర్ కు వెంటనే ఈ మెయిల్, ఎస్ఎంఎస్ ద్వారా కార్డు మూసివేసిన సంగతి తెలియజేయాలి. క్రెడిట్ స్కోరు, ఆదాయం, సకాలంలో చెల్లింపుల ఆధారంగా కార్డు సంస్థలు క్రెడిట్ కార్డు పరిమితిని పెంచుతామని చెబుతుంటాయి. ఇప్పటివరకూ బ్యాంకులు దీన్ని సొంతంగానే నిర్ణయం తీసుకొని, వినియోగదారులకు ఆ సమాచారాన్ని అందించేవి. కొన్నిసార్లు అడక్కుండానే పరిమితి పెంచిన కార్డులను పంపిస్తూ ఉండేవి. ఇకమీదట అలా చేయాలంటే తప్పనిసరిగా వినియోగదారుల అనుమతి తీసుకోవాలి. కార్డుదారులకు తెలియకుండా పరిమితిని పెంచి, దానికి ఛార్జీలు విధిస్తే.. ఆ మొత్తాన్ని వెనక్కి ఇవ్వడంతోపాటు, చార్జీలకు రెట్టింపు మొత్తాన్ని వినియోగదారులకు చెల్లించాల్సి ఉంటుంది. కార్డును ఏడాదిపాటు వినియోగించకుంటే దాన్ని రద్దు చేసే అధికారం బ్యాంకులకూ ఉంటుంది. దీనికోసం 30 రోజుల ముందుగా బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు వినియోగదారులకు నోటీసులు ఇవ్వాల్సి ఉంటుంది. అప్పటికీ వినియోగదారుడు స్పందించకపోతే.. కార్డు రద్దు అవుతుంది. అలాగే.. కార్డు చేతికి అందిన 30 రోజుల వరకూ కార్డును యాక్టివేట్ చేసుకోకపోతే.. జారీ సంస్థ ఓటీపీ ద్వారా దాన్ని యాక్టివేట్ చేసుకోవాలని కోరుతుంది. అప్పటికే వినియోగదారుడు స్పందించకపోతే.. ఏడు రోజుల వ్యవధి తర్వాత కార్డును చార్జీలూ విధించకుండానే కార్డును రద్దు చేసే అవకాశం ఉంటుంది. కొత్త నిబంధనల ప్రకారం క్రెడిట్ కార్డు హోల్డర్లు.. బిల్లింగ్ సైకిల్ తేదీలను ఒకసారి మార్చుకోవచ్చు. ఈ మేరకు ఆర్టీఐ, కార్డు జారీ సంస్థలను ఆదేశించింది. సాధారణంగా క్రెడిట్ కార్డులకు బిల్లింగ్ సైకిల్ ఒకేలా ఉండదు.. వేరు వేరు కార్డులకు వేర్వేరుగా ఉంటుంది. చాలామంది క్రెడిట్ కార్డు బిల్లులను పూర్తిగా చెల్లించకుండా.. కనీస బాకీ మొత్తాన్ని చెల్లిస్తుంటారు. సాధారణంగా కార్డు బాకీలో ఇది 5 శాతం మేరకు ఉంటుంది. కేవలం కనీస మొత్తం చెల్లిస్తూ ఉండటం వల్ల అధిక వడ్డీ భారం పడుతూ ఉంటుంది. ఈ విషయంలో కార్డు జారీ సంస్థలు వినియోగదారులకు అవగాహన కల్పించాలని ఆర్బీఐ సూచించింది. అలాగే బ్యాంకులు ఇష్టారీతిన క్రెడిట్ కార్డ్‌లను జారీ చేయకూడదు. ఏదైనా సరే ఆర్బీఐ నిబంధనల మేరకు నడుచుకోవాలి. ముఖ్యంగా కస్టమర్ అనుమతి లేకుండా కంపెనీ క్రెడిట్ కార్డ్‌ని జారీ చేయకూడదు.. అలా చేస్తే ఆ కంపెనీ పెనాల్టీ కట్టాల్సి ఉంటుంది. క్రెడిట్ కార్డు కొత్త రూల్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఇది కూడా చదవండి: Aadhar: మీ ఆధార్ వివరాలను ఎక్కడెక్కడ వాడారో ఇలా తెలుసుకోండి..! ఇది కూడా చదవండి: EPFO: పీఎఫ్ అమౌంట్ విత్‌డ్రా చేస్తున్నారా?.. ఈ విషయాలు తప్పక గుర్తుంచుకోండి!