దేశీయ పారిశ్రామిక దిగ్గజం టాటా గ్రూప్ తన వ్యాపారాన్ని విస్తరించే పనిలో పడింది.

ఆటోమొబైల్, ఐటీ, స్టీల్.. ఇలా వివిధ రంగాల్లో వ్యాపారాలు సాగిస్తున్న టాటా గ్రూప్ త్వరలో స్మార్ట్ ఫోన్ తయారీలో అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. 

యాపిల్ కు చెందిన ఐఫోన్ల తయారీని భారత్ లో టాటా గ్రూప్ చేపట్టనున్నట్లు వార్తలొస్తున్నాయి. 

అందుకోసం ఐఫోన్ అసెంబ్లింగ్ యూనిట్ ను ఏర్పాటు చేసేందుకు తైవాన్ కు చెందిన విస్ట్రోన్ కార్ప్‌తో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం చైనాలో కొవిడ్ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. వీటి కట్టడి కోసం చైనా ప్రభుత్వం అక్కడక్కడ లాక్‌డౌన్ విధిస్తోంది. 

దీంతో.. ఇప్పటికే మార్కెట్లోకి రావాల్సిన ఐఫోన్లు ఆలస్యమవుతున్నాయి.

మరోవైపు యాపిల్.. భారత్‌లో తన మార్కెట్‌ను విస్తరించుకునేందుకు ప్రణాళికలు రచిస్తోంది. దీనిని మంచి అవకాశంగా భావిస్తోందిటాటా గ్రూప్‌. 

ఇప్పటికే ఐఫోన్ తయారీ రణగంలో ఉన్న కంపనీని సొంతం చేసుకుంటే పనులు త్వరగా అవుతాయని భావిస్తోంది.

అందుకోసం తైపీకి చెందిన విస్ట్రోన్‌ కార్పొరేషన్ ను చేజిక్కించుకునే పనిలో ఉంది.

అందుకోసం టాటా గ్రూప్ 612.6 మిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో రూ.5 వేల కోట్లు ఖర్చు చేయనున్నట్లు ప్రముఖ జాతీయ పత్రిక కథనాన్ని నివేదించింది.

కాగా, 2017 నుంచి విన్స్టన్ కార్పొరేషన్ భారత్ లో ఐఫోన్ తయారీని చేపడుతోంది. 

ఈ మానుఫ్యాక్చరింగ్ యూనిట్‌ కర్ణాటక బెంగళూరులోనే ఉంది. దీన్ని చేజిక్కించుకునేందుకు టాటా గ్రూప్ ప్రణాళికలు రచిస్తోంది. 

ప్రస్తుతం దేశీయ ఎలక్ట్రానిక్ రంగంలో చైనా హవానే కొనసాగుతోంది.

ఒకవేళ టాటా గ్రూప్ యోచిస్తున్నట్టు విస్ట్రోన్‌తో ఒప్పందం కుదిరితే భారత్‌లో ఐఫోన్ తయారీ చేపట్టనున్న తొలి దేశీయ కంపెనీగా టాటా నిలవనుంది. అంతేకాదు.. చైనా పెత్తనానికి కూడా చెక్ పెట్టినట్లు అవుతుంది.