ఇండోర్ వేదికగా న్యూజిలాండ్ తో జరిగిన చివరి వన్డేలో భారత్ 90 పరుగుల తేడాతో విజయం సాధించింది.

ఈ మ్యాచ్ లో టీమిండియా ఓపెనర్లు శుభ్ మన్ గిల్-రోహిత్ శర్మలు సెంచరీలతో చెలరేగారు.

ఇక సుదీర్ఘకాల నిరీక్షణ తర్వాత శతకం సాధించాడు హిట్ మ్యాన్. మూడు సంవత్సరాల తర్వాత సెంచరీ కొట్టాడు రోహిత్.

న్యూజిలాండ్ బౌలర్లపై ఆది నుంచి ఎదురుదాడికి దిగాడు రోహిత్ శర్మ. ఫోర్లు, సిక్సర్లతో కివీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు.

ఇక ఈ మ్యాచ్ లో 85 బంతుల్లో 9 ఫోర్లు, 6 సిక్స్ లతో 101 పరుగులు చేశాడు రోహిత్.

ఈ సెంచరీతో ఆస్ట్రేలియా దిగ్గజ బ్యాటర్, మాజీ ఆటగాడు రికీ పాంటింగ్ రికార్డును సమం చేశాడు రోహిత్ శర్మ.

వన్డేల్లో 30 సెంచరీలు బాది అత్యధిక శతకాలు బాదిన మూడో బ్యాటర్ గా రికీ పాంటింగ్ తో సమానంగా నిలిచాడు హిట్ మ్యాన్.

పాంటింగ్ 365 వన్డేల్లో 30 శతకాలు కొడితే.. రోహిత్ కేవలం 234 వన్డేల్లోనే ఈ రికార్డును సాధించాడు.

ఇక అత్యధిక సెంచరీలు బాదిన జాబితాలో క్రికెట్ గాడ్ సచిన్ 452 ఇన్నింగ్స్ ల్లో 49 సెంచరీలు బాది అగ్రస్థానంలో ఉన్నాడు.

తర్వాత టీమిండియా రన్ మెషిన్ విరాట్ కోహ్లీ 262 ఇన్నింగ్స్ ల్లోనే 46 శతకాలు బాది సచిన్ వెన్నంటే రెండవ స్థానంలో ఉన్నాడు.