చలికాలంలో అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువ. జలుబు, జ్వరం, దగ్గు వంటి అనారోగ్య సమస్యల నుంచి పిల్లలని రక్షించుకోవాలంటే వారి రోగనిరోధక శక్తిని పెంపొందించాలి.

పిల్లల్లో రోగనిరోధక శక్తిని పెంచడం కోసం కొన్ని ఆహార పదార్థాలు పెట్టాలి.  

పెరుగు తింటే జలుబు చేస్తుందని అంటారు. కానీ పెరుగు వల్ల చలికాలంలో కూడా మంచి ప్రయోజనాలు ఉన్నాయి. పెరుగు మీ జీర్ణనాళాన్ని, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

పెరుగులో కాల్షియం, పొటాషియం, విటమిన్ డి సహా అనేక రకాల పోషకాలు ఉంటాయి. 

పిల్లలకు రోజూ ఒక కప్పు పెరుగు తినిపిస్తే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. పెరుగులో చక్కెర గానీ, ఇంకేమీ కలపకూడదు.

జీడిపప్పు, వేరు శనగలు, పిస్తా, వాల్ నట్స్ వంటి వాటిని చలికాలంలో తింటే శరీరం వెచ్చగా అవుతుంది. అంతేకాదు పిల్లల జీవక్రియ కూడా సజావుగా ఉంటుంది.

పొద్దు తిరుగుడు విత్తనాలు, చియా విత్తనాలు, గుమ్మడి గింజలు, అవిసె గింజలు, నువ్వులు వంటి వాటిలో పోషకాలు అధికంగా ఉంటాయి.

వీటిలో ఉండే విటమిన్ ఇ పిల్లల్లో రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

అలానే ఈ విత్తనాలు రక్తంలో షుగర్ లెవల్స్ ని తగ్గిస్తాయి. కొలెస్ట్రాల్ లెవల్స్ ని నియంత్రణలో ఉంచుతాయి.

గుడ్లు అనేవి సూపర్ ఫుడ్. చలికాలంలో తింటే పిల్లలకి, పెద్దలకి ఇద్దరి ఆరోగ్యానికి మంచిది. ఉడకబెట్టిన గుడ్లు, ఆమ్లెట్, బ్రెడ్ ఆమ్లెట్, బ్రోకలీతో వేయించిన కూరగాయల గుడ్లు వంటివి పిల్లలకు చేసి పెడితే ఇష్టంగా తింటారు. 

ఎగ్ కర్రీ, ఎగ్ బిర్యానీ కూడా మంచిదే. గుడ్లలో శరీరానికి కావాల్సిన ప్రోటీన్లు, విటమిన్లు ఉంటాయి.

చలికాలంలో పిల్లలకి ఎక్కువగా ఆకుకూరలు, కాయగూరలతో చేసిన ఆహారం పెడితే మంచిది. బ్రోకలీ, కాలీఫ్లవర్, క్యాబేజీ, బచ్చలికూర వంటివి పిల్లల్లో రోగనిరోధకశక్తిని పెంచుతాయి.

వీటిలో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ కె, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

పిల్లలకు ద్రాక్ష పండ్లు, తీపి నిమ్మకాయ, నారింజ, సిట్రస్ పండ్లు తినిపిస్తే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వీటిలో రోగనిరోధక శక్తిని పెంచే విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది.

విటమిన్ సి తో పాటు విటమిన్ బి, యాంటీ ఆక్సిడెంట్లు, ఫాస్ఫరస్, మేగ్నేషియం, పొటాషియం సహా అనేక పోషకాలు ఉంటాయి.