పిల్లలపై ఆధారపడకూడదన్న ఉద్దేశంతో 60ఏళ్లు దాటిన వృద్ధులకు..వృద్ధాప్య పింఛన్లు ఇస్తున్నాయి పలు ప్రభుత్వాలు.
అలాగే వితంతు పెన్షన్, వికలాంగుల కోసం పింఛను గురించి విన్నాం. వెనుక బడిన వర్గాల వారికి, వృత్తి కళాకారులకు ఫించన్లు ఇస్తున్నాయి
గీత కార్మికులు, చేనేత కార్మికులకు కూడా పెన్షన్లు ఇస్తున్నారు. అయితే ఓ ప్రభుత్వం మాత్రం పర్యావరణాన్ని కాపాండేందుకు సరికొత్త పింఛను విధానాన్ని తీసుకువచ్చింది.
వృద్ధుల మాదిరిగా వాటికి కూడా పెన్షన్ ఇవ్వాలని నిర్ణయించింది. సరికొత్త పింఛను విధానానికి తెరలేపింది.
ఇంతకు వేటికి పెన్షన్లు ఇవ్వబోతుందంటే.. చెట్లకు. వృక్షాలకు పింఛను ప్రకటించింది హర్యానా ప్రభుత్వం.
ఈ పెన్షన్ పథకానికి 75 ఏళ్లు దాటిన చెట్లు మాత్రమే అర్హులు. అవునండి..
వినడానికి వింతగా అనిపించిన హర్యానా అటవీ శాఖ మంత్రి కన్వర్ లాల్ గుర్జర్.. 75 ఏళ్లు దాటిన చెట్లకు పెన్షన్ ఇస్తామని ప్రకటించారు.
వృక్ష సంపద తరిగిపోతున్న నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆ వృక్షాలకు ఈ పథకం కింద ఏడాదికి రూ. 2500 ఇవ్వనున్నట్లు తెలిపారు.
రోడ్ల విస్తరణలో భాగంగా చెట్లను విచక్షణా రహితంగా నరికి వేస్తున్నామని, దీని వల్ల వృక్ష సంపద తరిగి, పర్యావరణానికి నష్టం చేకూరుతుందని.. ఈ నేపథ్యంలో ఈ చర్యకు ఉపక్రమించినట్లు చెప్పారు.
‘హర్యానా ప్రాణ్ వాయు దేవతా పెన్షన్ స్కీమ్’అనేది పాత చెట్లను రక్షించడం, పరిరక్షించాలనే భావనను ప్రజల్లో పెంపొందించడానికి ప్రారంభించినట్లు తెలిపారు.
వృద్ధ వృక్షాలను పరిరక్షించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కన్వర్ లాల్ పేర్కొన్నారు.
75 ఏళ్లు పైబడిన చెట్లు మాత్రమే పథకానికి వర్తిస్తాయని, పడిపోయిన, బోలుగా ఉన్న, చనిపోయిన, ఎండిపోయిన, వ్యాధిగ్రస్తులైన చెట్లు ఈ పథకానికి అర్హులు కావని తెలిపారు.
మర్రి వంటి ఒక మొక్క నుంచి ఉద్భవించే చెట్లను ఒకే చెట్టుగా పరిగణిస్తామని, అటవీ భూముల్లోని చెట్లను ఈ పథకం కిందకు చేర్చబోమని ఆయన చెప్పారు.
ఐదేళ్ల తర్వాత వచ్చే సమీక్ష వరకు ఈ పథకం కింద 4 వేల కన్నా ఎక్కువ చెట్లు ఉండవని అన్నారు.
‘ప్రాణ్ వాయు దేవత ట్రీ కన్సర్వేషన్ కమిటీ’క్రమబద్ధమైన గణన ద్వారా ఈ పథకానికి వర్తించే చెట్లను గుర్తించి, మ్యాప్ చేసి, జాబితాను రూపొందిస్తుందని తెలిపారు.