ప్రభాస్ రాముడిగా, కృతిసనన్ సీతగా నటించిన చిత్రం ఆదిపురుష్. ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఇవాళ విడుదలైంది.
బాహుబలి సినిమాతో ప్రభాస్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. అయితే ఆ రేంజ్ కి తగ్గా హిట్టు ఆ తర్వాత పడలేదు.
సాహో, రాధే శ్యామ్ సినిమాలు బ్లాక్ బస్టర్ కొడతాయనుకుంటే నిరాశపరిచాయి.
దీంతో అందరి ఆశలు ఆదిపురుష్ పైనే నెలకొన్నాయి. మరి ఆదిపురుష్ సినిమా అందరి ఆశలను నిజం చేసిందా? హిట్ కొట్టిందా? లేదా? సమీక్షలో చూద్దాం.
కథ: లంకలో రావణాసురుడు అమరత్వం కోసం ఘోర తపస్సు చేస్తుంటాడు. ఇటు సీతారామ, లక్ష్మణులు వనవాసం ఉంటారు.
ఆ సమయంలో శూర్పణఖ రాముడ్ని చూసి మనసు పడుతుంది. తనను పెళ్లి చేసుకోమని అడుగుతుంది.
తనకు సీతతో పెళ్లి జరిగిందని రాముడు చెబితే శూర్పణఖ సీత మీద దాడికి యత్నిస్తుంది. రాముడు శూర్పణఖ ముక్కు కోసేస్తాడు.
దీంతో శూర్పణఖ తన అన్న రావణుడికి ఫిర్యాదు చేస్తుంది. రావణుడు సీతను అపహరిస్తాడు.
సీత జాడ కోసం రాముడు ఎలాంటి ప్రయత్నం చేశాడు? ఆ సమయంలో రాముడు ఎంత వేదన పడ్డాడు? లంక ప్రయాణం ఎలా సాగింది?
రామసేతుని నిర్మించి లంకకు ఎలా చేరుకున్నాడు? రావణుడిని ఎలా సంహరించాడు? అనేది మిగిలిన కథ.
రామసేతుని నిర్మించి లంకకు ఎలా చేరుకున్నాడు? రావణుడిని ఎలా సంహరించాడు? అనేది మిగిలిన కథ.
విశ్లేషణ: రామాయణ కథ అందరికీ తెలిసిందే. అయినా కానీ ఎంతమంది ఎన్ని సార్లు తీసినా చూసే ఆసక్తి ఉంటుంది. అది ఆ సీతారాముల గొప్పతనం.
అలాంటి సీతారాముల పాత్రల్లో ప్రభాస్, కృతిసనన్ లు నటించిన తీరు ఆకట్టుకుంటుంది.
రామ, రావణుల పాత్రలను దర్శకుడు ఓం రౌత్ చాలా బాగా తెరకెక్కించారు. చాలా పవర్ ఫుల్ గా చూపించారు.
సినిమా మొదలైన 15 నిమిషాల తర్వాత యాక్షన్ ఎపిసోడ్ లో రాముడి ఎంట్రీ ఉంటుంది. ఆ ఎపిసోడ్ మాత్రం గూస్ బంప్స్ తెప్పిస్తుంది.
సీతను అపహరించిన సమయంలో రావణుడితో జటాయువు పోరాడే సన్నివేశం చాలా ఆసక్తిగా ఉంటుంది. వాలి, సుగ్రీవుల మధ్య వచ్చే పోరాట సన్నివేశాలు ఆకట్టుకుంటాయి.
రామసేతు నిర్మాణ సన్నివేశాలు విజువల్ పరంగా బాగున్నాయి. హనుమంతుడు సంజీవని పర్వతాన్ని తీసుకొచ్చే సన్నివేశం, ఇంద్రజిత్తు, కుంభకర్ణుడితో చేసే పోరాట సన్నివేశాలు ఆకట్టుకుంటాయి.
రాముడు, రావణుడు తొలిసారి ఎదురుపడిన సీన్ చాలా కొత్తగా, ఆసక్తికరంగా ఉంటుంది. భావోద్వేగాలు, యాక్షన్ ఎపిసోడ్స్ తో ప్రథమార్థం ఆకట్టుకుంటే.. ద్వితీయార్థం మాత్రం కాస్త నిరాశపరుస్తుంది.
ప్రథమార్థంలో బాగున్నంతగా ద్వితీయార్థంలో వీఎఫ్ఎక్స్ వర్క్ బాగుండదు. నిడివి కూడా ఎక్కువ ఉండడంతో కాస్త బోరింగ్ అనిపిస్తుంది.
నటీనటుల పనితీరు: ఆదిపురుష్ సినిమాకి ప్రధాన ఆకర్షణ ప్రభాస్ అని చెప్పడంలో ఏమాత్రం సందేహం అవసరం లేదు.
ప్రభాస్ నటన సినిమాకి హైలైట్ గా నిలిచింది. సీత పాత్రలో కృతిసనన్, రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ మెప్పించారు.
లక్ష్మణుడి పాత్రలో సన్నీ సింగ్, హనుమంతుడిగా దేవదత్త నాగే, శూర్పణఖగా తృప్తి తొరడ్ మల్, మండోదరిగా సోనాల్ చౌహన్ మెప్పించారు.
సాంకేతిక వర్గం పనితీరు: ఆదిపురుష్ సినిమాకి సంగీతం ప్రధాన అలంకారమని చెప్పవచ్చు. సినిమాని ఓ రేంజ్ లో నిలబెట్టింది.
ఇక అజయ్, అతుల్ లు అందించిన జై శ్రీరామ్ పాటకి థియేటర్ హోరెత్తిపోతుంది.
కార్తీక్ పలాని ఛాయాగ్రహణం, నిర్మాణ విలువలు, వీఎఫ్ఎక్స్ పనితీరు ఆకట్టుకుంటాయి. హాలీవుడ్ సినిమాని చూసిన అనుభూతి కలుగుతుంది.
బలాలు: ప్రభాస్ నటన నేపథ్య సంగీతం ప్రథమార్థం ప్రీ క్లైమాక్స్
బలహీనతలు: నిడివి ద్వితీయార్థం
చివరి మాట: జై శ్రీరామ్ నినాదంతో ప్రేక్షకాభిమాన వానరులు నిర్మించిన రామసేతు మీద బాక్సాఫీస్ లంకకు చేరుకొని ఆదిపురుష్ విజయ యాత్రను కొనసాగిస్తోంది.