ప్రేమ.. వర్ణించలేని ఓ గొప్ప భావం.. మనుషులు చిత్రించలేని చక్కని రూపం. అది ఎప్పుడు.. ఏ క్షణాన ఎలా పుడుతుందో.. ఎవరిమీద పుడుతుందో గుర్తించటం అసాధ్యం. ఓ గొప్ప ప్రేమకు రంగు, కులం, మతం, ఆస్తులు అంటూ ఏ అడ్డుంకులు ఉండవు. ప్రేమ మనిషిని.. మనసునే చూస్తుంది తప్ప మిగితా వాటిని పట్టించుకోదు. ప్రేమ గురించి ఎన్నో పుస్తకాలు, సినిమాలు వచ్చాయి. కొన్ని చరిత్రలో చెరిగిపోని ముద్రను వేసుకున్నాయి. ప్రతీ లవ్ స్టోరీ ఓ కొత్తదనాన్ని కలిగి ఉంటుంది. ప్రతీ దానికి వేరే వాటితో పోలిక ఉండదు. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణే పాకిస్తాన్‌కు చెందిన ఓ యజమాని, డ్రైవర్‌ల ప్రేమ కథ. ఈ కథలో యువతి తన డ్రైవర్‌తో ప్రేమలో పడటానికి ఓ విచిత్రమైన కారణం ఉంది. డ్రైవర్ గేర్లు మార్చే స్టైల్ నచ్చి ఆ యువతి అతడి ప్రేమలో పడింది.
పెళ్లి కూడా చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. పాకిస్తాన్‌కు 21 ఏళ్ల ఫర్హాన్ అనే యువకుడు అదే ప్రాంతానికి చెందిన ఖతిజా అనే యువతి ఇంట్లో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఖతిజా తల్లిదండ్రులు తమ కూతురికి డ్రైవింగ్ నేర్పాలని ఫర్హాన్‌ను పురమాయించారు. అయితే, ఇద్దరు పక్కన పక్కన కూర్చోకుండా ఖతిజా తల్లిదండ్రులు ఆంక్షలు విధించారు. దీంతో అతడు డ్రైవింగ్ సీట్లో కూర్చుని డ్రైవింగ్ నేర్పిస్తుండగా.. ఖతిజా వెనకాల సీట్లో కూర్చుని అదంతా చూసేది. రియర్ వ్యూ మిర్రర్‌లోంచి అతడ్ని బాగా గమనించేది. ఈ నేపథ్యంలోనే అతడు గేర్లు మారుస్తున్న స్టైల్ ఆమెకు బాగా నచ్చింది.
దీంతో అతడిపై మనసు పారేసుకుంది. ఓ రోజు కారును రోడ్డు పక్కన ఆపాలని ఖతిజా.. ఫర్హాన్‌ను కోరింది. కారు ఆపిన తర్వాత జ్యూస్ తాగటానికి అతడ్ని తీసుకెళ్లింది. ఇద్దరూ జ్యూస్ తాగుతుండగా లవ్ ప్రపోజ్ చేసింది. దీంతో అతడు భయపడిపోయాడు. ఆమే ధైర్యం చెప్పింది. తర్వాత తల్లిదండ్రులతో ఓ పోరాటం చేసి పెళ్లికి ఒప్పించింది. ఇద్దరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగిపోయింది. పాకిస్తాన్‌కు చెందిన ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ వారిని ఇంటర్వ్యూ చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే, ఫర్హాన్ ఇప్పటివరకు ఖతిజాకు డ్రైవింగ్ నేర్పించకపోవటం కథలో ట్విస్ట్.