పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. ఈ పేరు గత కొద్దిరోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగానే కాదు.. దేశ వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది. పవన్ ఇంటి దగ్గర కొంతమంది వ్యక్తులు తచ్చాడటం.. పవన్ కల్యాణ్ భద్రతా సిబ్బందిపై దాడి చేయటం సంచలనంగా మారింది. పవన్‌ను హత్య చేయటానికి కుట్రలు జరుగుతున్నాయన్న ప్రచారాలు కూడా నడుస్తున్నాయి. దీంతో రామ్ చరణ్ తన బాబాయ్ భద్రత కోసం మరికొంతమంది బౌన్సర్లను రంగంలోకి దించారని సమాచారం. ఇంటి చుట్టూ పెద్ద సంఖ్యలో కాపలా ఉంచినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ రోడ్డుపై నడుస్తున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఆ వీడియోలో పవన్ కల్యాణ్ చుట్టూ బౌన్సర్ల మధ్యలో ఒంటరిగా నడుస్తూ ఉన్నారు. ఆయన వెనకాల కొంతమంది జనం ఆయన్ని ఫాలో అవుతున్నారు. వారి వెనకాల కొన్ని కార్లు కూడా ఉన్నాయి. పవన్ బ్లాక్ టీషర్ట్, బ్లూ జీన్స్ ధరించి ఉన్నాడు. ఆయన్ని గుర్తుపట్టిన అభిమానులు కేకలు వేస్తుండగా.. వారికి అభివాదం చేస్తూ పవన్ ముందుకు సాగిపోయారు. అయితే, ఈ వీడియోను ఎక్కడ చిత్రీకరించారన్నది తెలియరాలేదు. పవన్ ప్రస్తుతం హరిహర వీరమల్లు సినిమా షూటింగ్‌లో ఉన్నారు. ఈ వీడియో షూటింగ్ స్పాట్‌లోది అయి ఉంటుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
కాగా, వైజాగ్ ఘటన తర్వాత పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ ఇళ్ల వద్ద కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రెక్కీ నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే పవన్, నాదెండ్ల కార్లను కూడా ఆ గుర్తు తెలియని దుండగులు వెంబడించారని జనసేన నాయకులు ఆరోపిస్తున్నారు. అంతేకాదు.. పవన్ కళ్యాణ్ ఇంటి వద్ద కొంతమంది సెక్యూరిటీతో గొడవపడిన దృశ్యాలు సైతం బయటికి వచ్చేసరికి.. పవన్ పై కుట్ర చేస్తున్నారనే వార్తలకు బలం చేకూరింది. ఈమేరకు పవన్ పై కుట్ర చేస్తున్నారంటూ రెక్కీ నిర్వహించిన వీడియోలు, ఫోటోలు కూడా జనసేన నేతలు పోలీసులకు అందజేశారు.