సాధారణంగా భరించేవాడిని భర్త అంటారు. కానీ, నేటి సమాజంలో భరించే వారికంటే భార్యలను బాగా హింసించే వారే ఎక్కువయిపోయారు. చిన్నచిన్న కారణాలకు భార్యలను చిత్ర హింసలకు గురిచేస్తున్నారు. మరికొందరు ఓ అడుగు ముందుకేసి నమ్మి వచ్చిన భార్యను ఇంటి బయటకు గెంటేస్తున్నారు. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి కూడా తన భార్యను నానా విధాలుగా హింసలు పెట్టాడు. పరాయి వ్యక్తితో భార్యను గదిలో బంధించాడు. చివరకు ఇంటినుంచి బయటకు గెంటేశాడు. పోలీసులు తెలిపిన పూర్తి వివరాల్లోకి వెళితే.. ఉత్తర ప్రదేశ్, ఫతేహ్‌పూర్ జిల్లాలోని ఘాజీపూర్‌కు చెందిన ఓ మహిళకు హత్‌గామ్ ప్రాంతానికి చెందిన అఫ్జల్ అనే వ్యక్తితో 2010లో వివాహమైంది.
పెళ్లయిన కొన్ని నెలలు వీరి కాపురం సజావుగానే సాగింది. ఆ తర్వాతినుంచి అఫ్జల్ భార్యను హింసిస్తూ వస్తున్నాడు. ప్రతీ చిన్న విషయానికి ఆమెపై చెయ్యి చేసుకునేవాడు. ఆమెను విపరీతంగా కొట్టేవాడు. ప్రస్తుతం వీరికి నలుగురు పిల్లలు. పిల్లలు పుట్టినా అతడి వేధింపులు ఆగలేదు. భార్య శీలానికి చెడ్డ పేరు తేవాలన్న ఆలోచనతో ఓ ప్లాన్ వేశాడు. కొన్ని రోజుల క్రితం అఫ్జల్ తన భార్యను పరాయి వ్యక్తితో పాటు ఇంట్లో బంధించాడు. తర్వాత అతడిపై బెదిరింపులకు దిగాడు. తన భార్యపై అత్యాచారం చేశావంటూ కేసు పెడతానని బెదిరించాడు. అలా చేయకూడదంటే రెండు లక్షలు ఇవ్వాలన్నాడు.
అఫ్జల్ బెదిరింపులకు భయపడిపోయి ఆ వ్యక్తి రెండు లక్షలు ఇచ్చేశాడు. ఈ విషయం గురించి ఆమె తన తల్లి, సోదరుడికి చెప్పింది. దీంతో వారు అఫ్జల్ ఇంటికి వచ్చారు. అతడ్ని ఒప్పించే ప్రయత్నం చేశారు. అయినా అతడు వినలేదు. భార్య తల్లిపై సైతం దాడికి దిగాడు. ఆ వెంటనే భార్యకు విడాకులు ఇస్తున్నట్లు ప్రకటించి.. ఇంట్లోంచి బయటకు గెంటేశాడు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. లోకల్ పోలీసులు పట్టించుకోకపోవటంతో ఎస్పీకి ఫిర్యాదు చేసింది. ఎస్పీ ఆదేశాల మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.