ఈ మద్య రాజకీయ నేతలు ఆపదలో ఉన్నవారికి సహాయం చేస్తూ తమ మానవత్వాన్ని చాటుకుంటున్నారు. ఏదైనా కార్యక్రమానికి వెళ్తున్న సమయంలో రోడ్డుపై ప్రమాదాలు సంబవిస్తే వారి కాన్వాయ్ ఆపి మరీ బాధితులను ఆసుపత్రికి తమ సొంత వాహనాల్లో తరలించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అన్నమయ్య జిల్లా రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి తన కాన్వాయ్ లో వెళ్తున్న సమయంలో రోడ్డు ప్రమాదం జరిగింది. విషయం తెలుసుకొని వెంటనే అక్కడికి వెళ్లి బాధితులను తన సొంత వాహనంలో ఆసుపత్రికి తరలించారు. వివరాల్లోకి వెళితే..
రాయచోటి పట్టణానికి చెందిన సునీల్, మానస దంపతులు బైక్ పై వస్తుండగా అనుకోకుండా ప్రమాదం జరిగింది. బైక్ ప్రమాదంలో భార్యాభర్తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. అదే సమయంలో గాలివీడు పర్యటనకు వెళ్తున్న ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ప్రమాదం గురించి తెలుసుకొని వెంటనే అక్కడికి వెళ్లారు. వారిద్దరినీ వెంటనే తన వాహనంలో ఎక్కించి రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారికి వెంటనే మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు అదేశించారు. ఎమ్మెల్యే గా ఎంత బిజీగా ఉన్నా ఆయన ఆ దంపతులను కాపాడిన విషయంపై ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు.