అభిమానుల్లో తెలుగు అభిమానులు వేరయ్యా. భాషతో సంబంధం లేకుండా సినిమా బాగుందీ అని చెబితే చాలు భాష రాకపోయినా సినిమాలు చూస్తుంటారు.
నచ్చితే ఆయా పరిశ్రమలో పేరు తెచ్చుకున్న దాని కన్నా రెట్టింపు విజయాన్ని అందిస్తారు.
ఇంగ్లీషు సినిమాలే కాకుండా ముక్క కూడా అర్థం కానీ మలయాళ సినిమాలు ఎక్కువగా చూస్తుంటారు.
ఆదరిస్తుంటారు. కారణం మలయాళ సినిమాల్లో ఉండే ఆ రా అండ్ రియాలిటీకి మనవాళ్లు ఫిదా అయిపోతుంటారు.
అందుకే అక్కడి సినిమాలు చేసేందుకు టాలీవుడ్ హీరోలు కూడా ఊవిళ్లూరుతుంటారు.
అటు మాలీవుడ్ కూడా తమ సినిమాలను తెలుగులో డబ్బింగ్ చేసి క్యాష్ చేసుకోవాలనుకుంటుంది.
అలా ఇటీవల కాలంలో వచ్చి మెప్పించిన సినిమా 2018.
కేరళలో 2018లో జరిగిన అతి పెద్ద ప్రకృతి విపత్తు అయిన వరదల నేపథ్యంలో 2018 అనే సినిమాను రూపొందించారు.
ఈ సినిమాలో డబ్బింగ్ చిత్రాలతో పరిచయమైన, మోస్ట్ టాలెంటెడ్, విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న టోవినో థామస్ ప్రధాన పాత్రలో నటించారు.
కుంచికో బోబన్, అపర్ణా బాల మురళి, ఆసీఫ్ అలీ, వినీత్ శ్రీనివాసన్ కీలక పాత్రలు పోషించారు. కేరళలో సుమారు 150 కోట్లకు పైగా కొల్లగొట్టింది.
ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే చర్చించుకుంటున్న సమయంలో తెలుగులో ఈ సినిమాను తీసుకురావాలని భావించారు బన్నీ వాస్.
ఈ సినిమాను తెలుగులోకి డబ్ చేసి జీఏ2 పిక్చర్స్ బ్యానర్ పై గత నెల 26న విడుదల చేశారు. తొలిరోజే కోటికి పైగా కలెక్షన్లు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది.
ఇంకా థియేటర్లలో సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతున్న సమయంలో ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది.
థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్న సమయంలో ఓటీటీలో విడుదల చేయడం మంచిది కాదని 7,8 తేదీల్లో సమ్మెకు పిలుపునిచ్చారు.
ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ సోనీ లివ్ భారీ ధరకు కొనుగోలు చేసింది. జూన్ 6వ తేదీ నుండి ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది.
మలయాళంతో పాటు తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ భాషల్లో ఈ సినిమాను చూడవచ్చు.
అయితే ఇప్పుడు ఎక్కువ మంది చూస్తున్న ఓటీటీ సినిమాగా చరిత్ర సృష్టించింది ఈ సినిమా.
ప్రతి ఒక్కరినీ కదిలించిన ఈ సినిమా టాప్ రేటింగ్, వ్యూస్‌తో దుమ్ము రేపుతోంది.
ఇప్పటి వరకు అత్యధికంగా చూసిన సినిమా జాబితాలో 2018 చిత్రం ముందు వరుసలో ఉంది. ఇంతటి ఘన విజయం సాధిస్తుందని మేకర్స్ కూడా ఊహించి ఉండరు.