చలికాలం వచ్చిందంటే చాలు చర్మ సమస్యలు సర్వ సాధారణమైపోతాయి.

చర్మం పొడిబారి, బీడు భూముళ్లా పగుళ్లు ఇచ్చుకుంటుంది. తద్వారా దురద పెట్టడమే కాకుండా నల్లగా కూడా మారుతుంది.

తలపై కుదుళ్లు కూడా పొడిబారి చుండ్రు ఎక్కువవుతుంది.

చుండ్రు కారణంగా వెంట్రుకలు రాలిపోతుంటాయి. ఇలా అన్ని రకాలుగా చలికాలం అందరినీ ఇబ్బంది పెడుతుంది.

అటువంటి చలికాలంలో మనం మన చర్మాన్ని ఎలా కాపాడుకోవాలో ఇప్పుడు చూద్దాం. 

ఎక్కువ వేడిగా ఉన్న నీళ్లతో స్నానం చేయటం ద్వారా చర్మం దారుణంగా పాడవుతుంది.

చర్మంపై ఉన్న సహజ నూనెలను తొలగించి పొడిబారేలా చేస్తుంది. దీనికి బదులు గోరు వెచ్చని నీటితోనే స్నానం చేయటం మంచిది.

ఒకవేళ వేడి నీళ్లే కావాలి అనుకుంటే.. ఆ నీళ్లలో కాస్త కొబ్బరి నూనె లేదా ఆలివ్‌ నూనె వేసుకోవాలి. 

అలా కాకుంటే ఒంటికే మంచిగా నూనె రాసుకుని స్నానం చేయాలి. 

చలికాలం మన శరీరానికి రాసుకునే వాటిలో పెట్రోలియం ఉత్పత్తులు ఉండకుండా చూసుకోవాలి. సహజ పోషక పదార్థాలతో తయారు చేసిన క్రీమ్‌లను వాడాలి.

చలికాలంలో వారానికి కనీసం రెండుసార్లు స్క్రబ్‌తో చర్మాన్ని రుద్దాలి. ఇలా చేయడం వల్ల చర్మంపై ఉన్న మృత కణాలు తొలిగిపోయి కొత్తవి పుడతాయి.

రాత్రి పడుకోబోయే ముందు చేతులు, కాళ్లు, మోచేతులు, మోకాళ్ల దగ్గర చర్మానికి మాయిశ్చరైజింగ్‌ క్రీములు రాసుకోవాలి. 

చలికాలంలో దాహం తక్కువగా వేస్తుంది. అంటే దానర్థం మన శరీరానికి నీటి అవసరం లేదని కాదు. 

కనీసం రెండు గంటల కొకసారైనా ఓ గ్లాసుడు నీటి తీసుకుంటూ ఉండాలి. 

ఆరోగ్యకరమైన శరీరం కోసం మంచి ఆహారం తీసుకోవటంతో పాటు, ఎక్సర్‌సైజులు కూడా చేస్తూ ఉండాలి.