వైఎస్ జ‌గ‌న్‌కు అధికారం మ‌ళ్లీ దూరం కానుందా..?

0
262

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత‌, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి 2017 న‌వంబ‌ర్ 6న ప్రారంభించిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌ను 2019 జ‌న‌వ‌రి 9వ తేదీతో ముగించిన సంగ‌తి తెలిసిందే. ఇక అప్ప‌ట్నుంచి అటు ప్ర‌ముఖ మీడియా ఛానెళ్ల‌తోపాటు, ఇటు సోష‌ల్ మీడియాల్లోనూ జ‌గ‌న్ పాదయాత్ర హిట్టా..? ఫ‌ట్టా..? అనే కోణంలో చ‌ర్చ‌లు ప్రారంభ‌మ‌య్యాయి. చ‌ర్చావేదిక‌ల‌ను ఏర్పాటు చేసి మ‌రీ రాజ‌కీయ విశ్లేష‌కులు వారి వారి అభిప్రాయ‌ల‌ను తెలిపారు.

ఆ క్ర‌మంలోనే తెలుగు రాష్ట్రాల్లో పొలిటిక‌ల్ ఎన‌లిస్ట్‌గా గుర్తింపు పొందిన ప్రొఫెస‌ర్ కే.నాగేశ్వ‌ర‌రావు వైఎస్ జ‌గ‌న్ పాద‌యాత్ర‌పై త‌న‌దైన శైలిలో విశ్లేషణ చేశారు. జ‌గ‌న్ పాద‌యాత్ర‌పై త‌న‌మ‌న‌సులోని అభిప్రాయాన్ని మీడియా ఛానెల్ ఇంట‌ర్వ్యూ వేదిక‌గా వెల్ల‌డించారు. అంతేకాకుండా, జ‌గ‌న్‌ 2014 ఎన్నిక‌ల్లో అధికారం కోల్పోయేందుకు ప్ర‌ధాన కార‌ణాన్ని చెప్ప‌డంతోపాటు అదే సీన్ 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లోనూ రిపీట్ అవబోతుందంటూ చెప్పుకొచ్చారు.

ఇక అస‌లు విష‌యానికొస్తే, 2014లో ఎన్నిక‌ల సంద‌ర్భంగా టీడీపీ, బీజేపీ, జ‌న‌సేన క‌లిసి పోటీ చేసిన సంగ‌తి తెలిసిందే. మ‌రో ప‌క్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంట‌రిగా పోటీ చేసింది. ఆ మూడు పార్టీలు ఏక‌మై పోటీ చేసినా వైసీపీపై కేవ‌లం రెండు శాతం ఓట్ల తేడాతో మాత్ర‌మే విజయం సాధించింది. ఆ స‌మ‌యంలో ఆ రెండు శాతం ఓట్ల‌పైనే తెలుగు రాష్ట్రాల్లో విస్తృత చ‌ర్చ జ‌రిగింది. ఆ రెండుశాతం ఓట్ల‌పై ప్రొఫెస‌ర్ నాగేశ్వ‌ర‌రావు మాట్లాడుతూ ఆ స‌మ‌యంలో లెఫ్ట్ పార్టీలైన సీపీఎం, సీపీఐల‌తో పొత్తు పెట్టుకుని ఉంటే వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డికి అధికారం చేజిక్కి ఉండేద‌ని త‌న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు.

అలా నాడు చేసిన త‌ప్పునే మ‌ళ్లీ చేస్తున్నాడ‌ని, జ‌గ‌న్ ప్ర‌తిప‌క్షంలో ఉండికూడా ఏ పార్టీని క‌లుపుకుపోయేందుకు ముందుకు రావ‌డం లేద‌ని, ప్ర‌త్యేక హోదా, ఇత‌ర విష‌యాల్లో జ‌గ‌న్ ఒంట‌రిగా వ్య‌వ‌హ‌రించిన ఘ‌ట‌న‌లే అందుకు ఉదాహ‌ర‌ణ అన్నారు. వైఎస్ జ‌గ‌న్ ఇప్పటికైనా పొత్తుల దిశ‌గా కార్యాచ‌ర‌ణ‌ను ప్రారంభిస్తే వైసీపీకి లాభం చేకూరే అవ‌కాశం ఉంద‌ని ప్రొఫెస‌ర్ నాగేశ్వర‌రావు త‌న అభిప్రాయాన్ని వ్య‌క్త‌ప‌రిచారు.