జ‌గ‌న్ దూకుడు

0
248

2019 సార్వత్రిక ఎన్నికల్లో అఖండ విజ‌యం సాధించిన వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అసెంబ్లీ స‌మావేశాలు షురూ చేయ‌బోతున్నారు. ఈ నెల 12వ తేదీ నుంచి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ నూతన శాసనసభ తొలి సమావేశాలు ప్రారంభం అవుతాయి. ఐదు రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో నూతనంగా ఎన్నికైన 175 మంది, అధికార, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు పదవీ ప్రమాణ స్వీకారం చేస్తారు. స్పీకర్‌ ఎన్నిక కూడా ఉంటుంది.

మంత్రివర్గ విస్తరణ జూన్ 8వ తేదీన ఉండ‌బోతోన్న త‌రుణంలో సీఎం జ‌గ‌న్‌.. ఈ నెల 8వ తేదీ ఉదయం తొలుత సచివాలయంలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అదే రోజున మంత్రివర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం సచివాలయంలో జరుగుతుంది. మంత్రివర్గ విస్తరణకు ఒక రోజు ముందుగా 7వ తేదీన వైఎస్సార్‌ ఎల్పీ సమావేశం ఏర్పాటు చేసి మంత్రివర్గ కూర్పు ఎలా ఉండబోతోందో జ‌గ‌న్ త‌న ఎమ్మెల్యేల‌కు వివరిస్తారు.

అంతేకాదు, కొత్త మంత్రులతో ఏర్పడబోయే మంత్రివర్గ సమావేశం ఈ నెల 10వ తేదీన జరుగనున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో 12 నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ తొలి సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహం, ప్రభుత్వ పరంగా ప్రజలకు చేయాల్సిన ప‌నుల‌పై దిశానిర్దేశం వంటి అంశాలపై చర్చిస్తారని తెలుస్తోంది.