అయ్య‌ప్ప‌స్వామి ద‌ర్శ‌నం చేసుకున్న 50 ఏళ్ల‌లోపు మ‌హిళ‌లు..!

0
688

శ‌బ‌రిమ‌ల‌పై మ‌హిళ‌ల పంతం నెగ్గింది. 50 ఏళ్ల‌క‌న్నా త‌క్కువ వ‌య‌సున్న ఇద్ద‌రు మ‌హిళ‌లు అయ్య‌ప్ప ఆల‌యంలోకి ప్ర‌వేశించారు. ఆపై పోలీసుల సాయంతో అయ్య‌ప్ప ద‌ర్శ‌నాన్ని చేసుకున్నారు. అయితే, బింధు, క‌న‌క‌దుర్గ అనే ఇద్ద‌రు మ‌హిళ‌లు ఇవాళ అర్థ‌రాత్రి కొండ‌పైకి న‌డ‌క‌ను ప్రారంభించి తెల్ల‌వారుజామున కొండ‌పైకి చేరుకున్నారు. ఆ వెంట‌నే అయ్య‌ప్ప ద‌ర్శ‌నం చేసుకున్నారు. అయ్య‌ప్ప‌స్వామి ద‌ర్శ‌నం అనంత‌రం ఆల‌యం వెలుపల‌కు వ‌చ్చిన బింధు, క‌న‌క‌దుర్గ ఇద్ద‌రూ ఆనందంతో డ్యాన్స్ చేశారు.

అయితే, మ‌హిళ‌లు కూడా శ‌బ‌రిమ‌ల ఆల‌యంలోకి వెళ్లొచ్చ‌ని సుప్రీం కోర్టు తీర్పునిచ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ తీర్పు వెలువ‌డిన వెంట‌నే సంప్ర‌దాయ‌వాదులు తీవ్రంగా వ్య‌తిరేకించారు. మ‌హిళ‌ల ప్ర‌వేశానికి నిర‌స‌న‌గా ఆందోళ‌న‌ల‌ను నిర్వ‌హించారు. అయ్య‌ప్ప‌స్వామి ద‌ర్శ‌నానికి వ‌చ్చిన మ‌హిళ‌లను సైతం సాంప్ర‌దాయ వాదులు అడ్డుకున్నారు.

మ‌రోప‌క్క లింగ స‌మాన‌త్వం కోసం కేర‌ళ మ‌హిళ‌లు క‌థం తొక్కారు. 65వ జాతీయ ర‌హ‌దారిపై కాస‌ర్‌ఘ‌డ్ నుంచి 620 కిలోమీట‌ర్ల పొడ‌వునా మ‌హిళ‌లు మాన‌వ‌హారం చేప‌ట్టారు. వివిధ రంగాల‌కు చెందిన మ‌హిళ‌లు ఇందులో పాల్గొన్నారు. వారికి సంఘీభావంగా పురుషులు కూడా మాన‌వ‌హారం నిర్వ‌హించారు. శ‌బ‌రిమ‌ల ఆల‌యంలోకి మ‌హిళ‌ల‌ను అనుమ‌తించాల‌ని వారు డిమాండ్ చేశారు.

ఈ మాన‌వ‌హారంపై స్పందించిన కేర‌ళ సీఎం విజ‌య‌న్ మాన‌వ‌హారం ద్వారా కులం, మ‌తం అనే అడ్డుగోడ‌ల‌ను మ‌హిళ‌లు కూల‌దోస్తార‌న్నారు. కాస‌ర్‌ఘ‌డ్ వ‌ద్ద ఆరోగ్య‌శాఖ మంత్రి, వెల‌యంబోయంలో సీపీఐ జాతీయ నేత బృందాక‌ర‌త్ అయ్య‌ప్ప ఆల‌యంలోకి మ‌హిళ‌ల‌ను అనుమ‌తించాల‌ని నిర్వ‌హించిన మాన‌వ‌హారంలో పాల్గొన్నారు.