తెలంగాణ పంచాయ‌తీ ఎన్నిక‌లు నిలిపేస్తారా..?

0
180

ఈ నెల 1వ తేదీన తెలంగాణ ఎన్నిక‌ల సంఘం గ్రామ పంచాయ‌తీల‌కు ఎన్నిక‌లు నిర్వ‌హించేందుకు సంబంధించిన నోటిఫికేష‌న్‌ను జారీ చేసిన సంగ‌తి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా మూడు విడ‌త‌లుగా ఈ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. అయితే, నోటిఫికేష‌న్‌కు ముందే పంచాయ‌తీ రిజ‌ర్వేష‌న్‌ల‌లో బీసీల‌కు 22 శాతం కేటాయించారు. ఇదే ఇప్పుడు వివాద‌స్ప‌ద‌మైంది.

అయితే, గ‌తంలో 34 శాతం ఉన్న బీసీ రిజ‌ర్వేష‌న్‌ల‌ను 22 శాతానికి ఎలా త‌గ్గిస్తార‌ని ఆ వ‌ర్గం గొడ‌వ చేస్తోంది. దీన్ని స‌వాల్ చేస్తూ బీసీ సంఘం ముఖ్య నాయ‌కులు ఆర్.కృష్ణ‌య్య‌ హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. బీసీ రిజర్వేష‌న్‌లు త‌గ్గిస్తూ తీసుకొచ్చిన ఆర్డినెన్స్ చెల్ల‌ద‌ని ఆయ‌న కోర్టులో వేసిన పిటిష‌న్‌లో పేర్కొన్నారు. అంతేకాకుండా, క్యాబినేట్ లో చ‌ర్చించ‌కుండానే బీసీ రిజర్వేష‌న్‌ను త‌గ్గిస్తూ ఆర్డినెన్స్ ఎలా తీసుకొస్తారు..? అరి ప్ర‌శ్నించారు. బీసీ రిజ‌ర్వేష‌న్‌లు తేలే వ‌ర‌కు ఎన్నిక‌ల‌ను నిలిపివేసేలా ఆదేశాలు ఇవ్వాల‌ని ఆయ‌న కోరారు.

అలాగే, ఎన్నిక‌ల నోటిఫికేష‌న్‌ను ర‌ద్దు చేయాలంటూ బీసీ వ‌ర్గం నేత‌లు కోర్టులో హౌస్ మోష‌న్‌, లంచ్‌మోష‌న్ కోసం అభ్య‌ర్థించినా కుద‌ర‌లేదు. దీంతో, బీసీ రిజ‌ర్వేష‌న్‌ల‌పై ఇవాళ విచార‌ణ జరుపుతామ‌ని హైకోర్టు తెలిపింది. నేడు వాద‌, ప్ర‌తివాద‌న‌లు విన్నాక హైకోర్టు ఎన్నిక‌లు జ‌రిపేందుకు మొగ్గు చూపుతుందా.? లేదా.? అన్న‌ది తెలియాల్సి ఉంది.