హైకోర్టుకు బిగ్‌బాస్ నిర్వాహ‌కులు..!

0
136

తెలుగు బిగ్‌బాస్ సీజ‌న్ 3 ప్రారంభానికి ముందే వివాదాలు చుట్టుముడుతున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా బిగ్‌బాస్ – 3పై కాస్టింగ్ కౌచ్ ఆరోప‌ణ‌లు సంచ‌ల‌నం రేపుతున్నాయి. మ‌హిళా సెల‌బ్రెటీతో బిగ్‌బాస్ నిర్వాహ‌కులు అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించార‌న్న ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. తాజాగా ఓ యువ‌తి మ‌రో అడుగు ముందుకేసింది. బిగ్‌బాస్ నిర్వాహ‌కుల‌పై బంజారాహిల్స్ పోలీస్ స్టేష‌న్‌లో కేసు పెట్టింది. బిగ్‌బాస్ షోలో పాల్గొనేందుకు అంటూ త‌న‌ను పిలిచి లైంగికంగా వేధించార‌ని ఆ యువ‌తి పోలీసుల‌కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.

అంత‌కు ముందు ప్ర‌ముఖ జ‌ర్న‌లిస్ట్ శ్వేతారెడ్డి, గాయ‌త్రి గుప్తా వంటి ప్ర‌ముఖులు సైతం త‌మ‌ను బిగ్‌బాస్ – 3 రియాల్టీ షోకు త‌న‌ను ఎంపిక చేశార‌ని, అయితే త‌న‌కు అగ్రిమెంట్‌మాత్రం ఇవ్వ‌లేద‌ని చెప్పారు. అంతేకాకుండా బిగ్‌బాస్‌ను ఎలా సంతృప్తిప‌రుస్తారు..? వ‌ంటి ప్ర‌శ్న‌ల‌తో త‌మ‌ను లైంగికంగా వేధించార‌ని చెప్పారు. వారుసైతం బిగ్‌బాస్ -3పై పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. అయితే బిగ్‌బాస్ సీజ‌న్ 3 ఈ నెల 21 నుంచి ప్రారంభం కానున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో షోకు సంబంధించి ప‌లువురి సెల‌బ్రెటీల ఎంపిక పూర్త‌యింది. ఇలాంటి స‌మ‌యంలో నిర్వాహ‌కులపై లైంగిక వేధింపుల ఆరోప‌ణ‌లు అల‌జ‌డి రేపుతున్నాయి.

ఇలా బిగ్‌బాస్ -3పై పోలీసు స్టేష‌న్‌ల‌లో న‌మోద‌వుతున్న కేసుల‌కు సంబంధించి ఆ షో టీమ్ తాజాగా హైకోర్టును ఆశ్ర‌యించింది. హైకోర్టులో క్వాష్ పిటిషన్‌ను దాఖ‌లు చేసిన బిగ్‌బాస్ టీమ్ ప‌లు పోలీస్ స్టేష‌న్‌ల‌లో త‌మ షోపై న‌మోదైన కేసుల‌ను కొట్టేయాలంటూ పిటిష‌న్‌లో పేర్కొన్నారు.