కృష్ణా జిల్లాలో టీడీపీ – వైసీపీ శ్రేణుల ఘ‌ర్ష‌ణ‌..!

0
188

ఆంధ్ర‌ప్ర‌దేశ్ వ్యాప్తంగా అతి త్వ‌ర‌లో సాధార‌ణ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో అధికార, ప్ర‌తిప‌క్ష పార్టీల మ‌ధ్య మాట‌ల యుద్ధాలు తారా స్థాయికి చేరాయి. ఎంత‌లా అంటే ఒక‌రికొక‌రు ఎదురుప‌డితే కొట్టుకునేంత‌లా అన్న‌మాట‌. చంద్ర‌బాబు స‌ర్కార్ ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన జ‌న్మ‌భూమి – నా ఊరు ఆరో విడ‌త కార్య‌క్రమంలో చోటు చేసుకుంటున్న సంఘ‌ట‌న‌లే ఇందుకు ఉదాహ‌ర‌ణ‌.

ఇక అస‌లు విష‌యానికొస్తే, కృష్ణా జిల్లా ఉయ్యూరులో ఇవాళ నిర్వ‌హించిన జ‌న్మ‌భూమి – నా ఊరు కార్య‌క్ర‌మంలోనూ అటువంటి త‌ర‌హా ఘ‌ట‌నే చోటు చేసుకుంది. వైసీపీ శ్రేణులు, టీడీపీ శ్రేణుల మ‌ధ్య తీవ్ర వాగ్వాదం జ‌రిగింది. ఆపై ఒక‌రిపై మ‌రొక‌రు కుర్చీలు విసిరేస్తూ కొట్టుకున్నంత ప‌నిచేశారు.

కాగా, అంత‌కు ముందు కార్య‌క్ర‌మంలో భాగంగా టీడీపీ ఎమ్మెల్యే బోడె ప్ర‌సాద్ మాట్లాడుతుండ‌గా మ‌ధ్య‌లో క‌ల‌గ‌చేసుకున్న వైసీపీ నేత‌లు రామాంజనేయులు, పార్ధ‌సార‌ధి ఇద్ద‌రు కూడా ఇళ్ల కేటాయింపు, డ్వాక్రా రుణాల మాఫీకి సంబంధించిన నిధుల‌ను సొమ్ము చేసుకున్నావు.. నిరు పేద‌ల‌కు ఏమీ లేకుండా అన్ని నిధుల‌ను కాజేశావు అంటూ బోడె ప్ర‌సాద్‌పై ఆగ్ర‌హం వ్యక్తం చేశారు. దీంతో ఒక్క‌సారిగా టీడీపీ, వైసీపీ శ్రేణుల మ‌ధ్య తోపులాట జ‌రిగింది. ఘ‌ర్ష‌ణ‌కు సంబంధించి స‌మాచారం తెలుసుకున్న పోలీసులు అక్క‌డ‌కు చేరుకుని వైసీపీ శ్రేణుల‌ను అక్క‌డ్నుంచి పంపించేశారు.