తెలుగు రాష్ట్రాల్లో వేగంగా విస్తరిస్తున్న స్వైన్ ఫ్లూ..!

0
140

వాతావరణం చల్లబడితే చాలు హెచ్1 ఎన్1 వైరస్ వేగంగా విజృంభిస్తోంది. అసలే చలికాలం, ఆపై పెథాయ్ ఎఫెక్ట్తో తెలుగు రాష్ట్రాల్లో సీన్ ఒక్కసారిగా మారిపోయింది. ఉష్ణోగ్రతలు కనిష్టస్థాయికి చేరడంతో స్వైన్ ఫ్లూ లక్షణాలతో బాధితులు ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. తాజాగా హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో మరో ఇద్దరు మహిళలు అడ్మిట్ అయ్యారు.

స్వైన్ ఫ్లూ పేరు వింటేనే ప్రజలంతా హడలిపోతున్నారు. 2009లో ఈ వైరస్ జనంపై విరుచుకుపడింది. చాలా మందిని బలితీసుకుంది. ప్రమాదకరమైన హెచ్1ఎన్1 వైరస్ తక్కువ కాలంలోనే వేగంగా విస్తరించింది. దీంతో చాలా మంది ఆస్పత్రిపాలయ్యారు. గాలితో వ్యాపించే ఈ వైరస్ను అరికట్టేందుకు వైద్యులకు మూడేళ్లు పట్టింది.

స్వైన్ఫ్లూ బారినపడ్డ వ్యక్తిని వెంటనే ఆస్పత్రికి తరలించడంతోపాటు ఆ కుటుంబ సభ్యులకు ముందస్తు వ్యాక్సిన్లు ఇస్తూ వైద్యులు స్వైన్ఫ్లూను నియంత్రిస్తున్నారు. అయినప్పటికీ ఎవరో ఒకరు ఆ మహమ్మారికి బలవుతూనే ఉన్నారు. గతంలోలా ఇప్పుడు వైరస్లకు భయపడాల్సిన అవసరం లేకపోయినా వ్యాధి సోకితే మాత్రం వెంటనే చికిత్స చేయించుకోవాలని వైద్యులు చెబుతున్నారు.

వాతావరణంలో పూర్తిగా కలిసిపోయిన హెచ్1 ఎన్1 వైరస్ తన ప్రతాపాన్ని ఇప్పటికీ చూపుతోంది. గతేడాది స్వైన్ఫ్లూ బారినపడి దాదాపు 200 మంది మృత్యువాతపడ్డారు. వాతావరణంలో మార్పులు వచ్చిన ప్రతీసారి స్వైన్ ఫ్లూ వైరస్ యాక్టివ్ అవుతోంది. వాతావరణం చల్లబడితే చాలు వైరస్ ప్రభావం పెరిగిపోతుంది.

ముఖ్యంగా రోగ నిరోధకశక్తి తక్కువగా ఉన్నవాళ్లను ఈ వైరస్ ఎటాక్ చేస్తుంది. ఐదేళ్లకంటే తక్కువగా ఉన్న చిన్న పిల్లలు 60 సంవత్సరాలకు పైబడిన వృద్ధులు, గర్భిణీలు, ఆస్తమా రోగులు, క్యాన్సర్ బారిన పడిన వాళ్లకు స్వైన్ ఫ్లూ త్వరగా సోకే అవకాశం ఉంది. ఇలాంటి వారంతా సరైన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.