సుప్రీం ముందుకు హైకోర్టు త‌ర‌లింపు పంచాయితీ..!

0
188

దేశ అత్యున్న‌త న్యాయ స్థానం సుప్రీం కోర్టులో ఇవాళ తెలుగు రాష్ట్రాల ఉమ్మ‌డి హైకోర్టు విభ‌జ‌న అంశంపై విచార‌ణ జ‌ర‌గ‌నుంది. అయితే, త‌మ‌కు ఎలాంటి వ‌స‌తులు క‌ల్పించ‌కుండానే హైకోర్టును ఏపీకి త‌ర‌లించారంటూ న్యాయ‌వాదులు గ‌త శ‌నివారం పిటిష‌న్ వేసిన సంగ‌తి తెలిసిందే. ఆ పిటిషన్‌పై ఇవాళ సుప్రీం కోర్టులో వాదోప‌వాదాలు జ‌ర‌గ‌నున్నాయి.

తెలుగు రాష్ట్రాల‌కు ఉమ్మ‌డిగా ఉన్న హైకోర్టును విభ‌జిస్తూ రాష్ట్ర‌ప‌తి ఉత్త‌ర్వుల‌ను జారీ చేయ‌డం ఏపీలో న్యాయ‌స్థానం ఏర్పాటుకావ‌డం ఇవ‌న్నీ చ‌కా.. చ‌కా జ‌రిగిపోయాయి. మంగ‌ళ‌వారం నుంచి కోర్టులు వేర్వేరుగా ప‌నిచేస్తున్నాయి. అయితే, హ‌డావుడిగా హైకోర్టుల‌ను ఏర్పాటు చేయ‌డాన్ని ఏపీ లాయర్స్ అసోసియేష‌న్ త‌ప్పుబ‌ట్టింది. అందులో భాగంగా ఏకంగా సుప్రీం కోర్టులో పిటిష‌న్‌ను దాఖ‌లు చేసింది.

అయితే, హైకోర్టు విభ‌జ‌న‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం సిద్ధ‌మ‌ని గ‌తంలోనే చెప్పింది. అందు కోసం తాత్కాలిక హైకోర్టు భ‌వ‌న నిర్మాణాన్నీ చేప‌ట్టింది. ప‌నులు కూడా వేగంగా జ‌రుగుతున్నాయి. హైకోర్టు భ‌వ‌న న‌మూనాను న్యాయ‌మూర్తుల బృందం గ‌తంలో సంద‌ర్శించి త‌మ సానుకూల‌త‌ల‌ను కూడా వ్యక్తం చేశారు. అయితే, హ‌డావుడిగా ఏపీ హైకోర్టును ఏర్పాటు చేస్తూ ఉత్త‌ర్వులు ఇవ్వ‌డాన్ని కొంద‌రు త‌ప్పుబ‌ట్టి సుప్రీం త‌లుపులు త‌ట్టారు. శ‌నివారం లాయ‌ర్ల పిటిష‌న్‌ను స్వీక‌రించిన సుప్రీం కోర్టు ఇవాళ దానిపై విచార‌ణ జ‌ర‌ప‌నుంది.