మూఢనమ్మకాలతో పసిపాప ప్రాణం మీదకు ..!

0
180

ఈరోజుల్లో సాంకేతికపరిజ్ఞానం ఎంత ముందుకు వెళ్తున్నా కూడా, ఇంకా మూఢ నమ్మకాలతో సాగుతున్నవారున్నారు. ఆచారం పేరుతో 10 రోజుల పసి గుడ్డు కడుపు పైన తల్లిదండ్రులు వాతలు పెట్టినటువంటి  ఘటన విజయనగరం జిల్లా సాలూరు ఏజెన్సీలో జరిగింది.

స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం..

విజయనగరం జిల్లా సాలూరు ఏజెన్సీలోని పాచిపేట మండలము సమీపాన ఊబిగడ్డ గ్రామంలో నర్సమ్మ, శ్రీను అనే దంపతులకు గత 10 రోజుల క్రితం పాప జన్మించింది. ఆసుపత్రి నుండి వాళ్ళ ఊరికి తీసుక వెళ్ళాక పాపకు కొంచము అనారోగ్యం కలిగింది. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యుడికి చూపించిన తర్వాత పచ్చకామెర్లు, ఉబసం వచ్చిందని తెలిసింది. దీంతో ఆసుపత్రి కన్నా, వాతలు పెడితే బిడ్డకు పచ్చకామెర్లు తగ్గుతాయని, వారి చినమ్మ చెప్పడంతో గుడ్డిగా నమ్మి 10 రోజుల పసి పాపకు వరుసగా మూడు రోజుల పాటు వాతలు పెట్టారు.

సూదితో వాతలు పెట్టడం వలన గాయాలు కూడా అయ్యాయి. ఇలా పెడుతుండగా రోజురోజుకు పసి పాప ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. కన్నవారు మూఢ నమ్మకంతో వ్యవహరించిన తీరుపై స్థానికులు మండి పడ్డారు. దీంతో పసిపాపను సాలూరు ఆసుపత్రికి తరలించారు. ఆ పాప పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని డాక్టర్లు చెప్పారు. కొన్ని రోజులు పాటు పాపను ఐసీయూలో ఉంచి చికిత్స చేయాలని వైద్యులు సూచించగా వైద్యం కొనసాగిస్తున్నారు. పాప తల్లిదండ్రులకు డాక్టర్లు కౌన్సెలింగ్ కూడా ఇచ్చారు.