సాహోకి సౌండెక్కువ చ‌మురు త‌క్కువ‌.!

0
68

మోస్త‌రు సినిమాగా మొద‌లై బాహుబ‌లి విజ‌యంతో భారీ బ‌డ్జెట్ సినిమాగా రూపాంత‌రం చెందింది సాహో చిత్రం. ఎన్నో నాట‌కీయ ప‌రిణామాల మ‌ధ్య సాగుతూ వ‌స్తోంది ఈ సినిమా షూటింగ్‌. అటు సాంకేతిక వ‌ర్గం కూడా మార్పులు చేర్పుల‌కు గురౌతోంది. క‌ట్ చేస్తే ఎంతోకాలంగా ప్రేక్ష‌కులు ఎదురుచూస్తోన్న ఈ సినిమా టీజ‌ర్ ఎట్ట‌కేల‌కు ఇవాళ రిలీజ్ చేశారు. అయితే, ఈ సినిమా టీజ‌ర్‌ పై పెద‌వివిరుస్తున్నారు సినీ అభిమాన‌జ‌నం.

టీజ‌ర్ ద్వారా తెలిసొచ్చిందేంటంటే… సాహోలో హ‌డావుడి త‌ప్పితే, విష‌యం ఏం లేన‌ట్టుంద‌నే కామెంట్స్ ప‌డిపోతున్నాయి. హీరో ద‌గ్గ‌ర్నుంచి చోటామోటా విల‌న్స్ వ‌ర‌కూ అంద‌ర్నీ స్టైల్ గా చూపించ‌డం మిన‌హా సినిమాలో ఏం లేద‌న్న‌ది తేలిపోయిందంటున్నారు. యాక్ష‌న్‌, భారీ వ్య‌యం, ఛేజింగులు, బ్లాస్టింగులు త‌ప్ప సినిమాలో కంటెంట్ ఏమాత్రం క‌నిపించ‌లేదంటున్నారు.

క‌థానాయిక శ్ర‌ద్దాక‌పూర్ సీన్స్ కూడా ఏ మాత్రం పండ‌లేదంటున్నారు. డైలాగ్స్ లో ప‌స‌లేకుండా, ల‌వ్ కెమిస్ట్రీకూడా నాసిర‌కంగా ఉందంటున్నారు. `డైహార్ట్ ఫ్యాన్స్‌` అంటూ ప్ర‌భాస్ అమాయ‌కంగా చెప్ప‌డం.. `నాకెవ‌రూ లేరు` అనుకునే ఓ అమ్మాయి కోసం ఓ అబ్బాయి వీర‌పోరాటాలు.. వెర‌సి టీజ‌ర్లో మ‌ళ్లీ మ‌ళ్లీ చూడాల‌నిపించే ఒక్క‌సీనూ లేదంటున్నారు. ఇక.. కోట్లు కుమ్మ‌రిస్తోన్న ఈ సినిమా రిలీజైతే ప‌రిస్థితి ఏంట‌ని సోష‌ల్ మీడియాలో మద‌న‌ప‌డిపోతున్నారు సినిమా అభిమానులు.