ఏపీలో మళ్లీ రీ పోలింగ్..!

0
161

ఏపీలో మ‌ళ్లీ రీ పోలింగ్ జ‌రిపేదుకు కేంద్ర ఎన్నిక‌ల సంఘం నిర్ణ‌యించింది. కాగా, సీఈసీ జారీ చేసిన నోటిఫికేష‌న్ మేర‌కు చిత్తూరు జిల్లా చంద్ర‌గిరి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలోని ఐదు పోలింగ్ బూత్‌ల‌లో పోలింగ్ జ‌ర‌గ‌నుంది. నియోజ‌క‌వ‌ర్గంలోని పులివర్తిపల్లి (బూత్ నెం.104), కమ్మపల్లి (బూత్ నెం.318, బూత్ నెంబర్ 321), వెంకట్రామపురం (బూత్ నెం.313), కొత్త కండ్రిగ (బూత్ నెం.316) పోలింగ్ బూత్‌ల ప‌రిధిలోని ప్ర‌జ‌లు మ‌ళ్లీ వారి ఓటు హ‌క్కును వినియోగించుకోనున్నారు.

అయితే, ఇటీవ‌ల ఏపీలో జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో భాగంగా చంద్రగిరి నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ శ్రేణులు అల్ల‌క‌ల్లోలం సృష్టించార‌ని, వైసీపీ మ‌ద్ద‌తు దారులు ఓటేసేందుకు బూత్‌ల వ‌ద్ద‌కు రానివ్వ‌కుండా టీడీపీ వ‌ర్గాలు అడ్డుకున్నాయ‌ని వైసీపీ ఎమ్మెల్యే అభ్య‌ర్ధి చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డి ఎన్నిక‌ల సంఘం ఉన్న‌తాధికారుల‌కు ఫిర్యాదు చేసిన సంగ‌తి తెలిసిందే.

అలాగే మ‌రో ప‌ది బూత్‌ల‌లో రీపోలింగ్ నిర్వ‌హించాల‌ని టీడీపీ కూడా ఎన్నిక‌ల సంఘానికి ఫిర్యాదు చేసిన‌ట్టు తెలుస్తుంది. దీంతో ఇరువురి వాద‌న‌లు విన్న ఎన్నిక‌ల సంఘం అధికారులు చంద్ర‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలోని పైన పేర్కొన్నఐదు పోలింగ్ బూత్‌ల‌లో పోలింగ్ నిర్వ‌హించేందుకు రంగం సిద్ధం చేశారు. కాగా, ఈ ద‌ఫా జ‌రుగుతున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల చివ‌రి ద‌శ అయిన 19వ తేదీన చంద్ర‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలోని ఐదు పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జ‌ర‌గ‌నుంది.