నరబలా? లేక హత్యనా?

0
137

టెక్నాల‌జీతో పోటీప‌డుతూ దూసుకుపోతున్న నేటి కాలంలోను నల్లమల అడవుల్లో చోటు చేసుకున్న నరబలి పెను సంచ‌ల‌నం సృష్టిస్తోంది. అడవిలోప‌ల గ‌ల ఓ ప్ర‌ముఖ ఆలయానికి స‌మీపంలో జ‌రిగిన ఈ క్షుద్రపూజ ఆ ప్రాంత నివాసుల‌ను ఆందోళ‌న‌కు గురి చేస్తోంది. ఆల‌యానికి అతి స‌మీపంలో మాన‌వ శ‌రీరానికి సంబంధించిన తల, మొండెం, ఇతర శరీర భాగాలు బయటపడటం నల్లమల ఫారెస్ట్‌లో తీవ్ర అలజడి సృష్టిస్తోంది. జరిగింది నరబలా? లేక హత్యనా? అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.

కర్నూలు జిల్లా సిరివెళ్ల మండలం సర్వ నరసింహస్వామి ఆలయం సమీపంలో వాగులో కనబడిన ఓ డెడ్‌బాడీని కొంతమంది స్థానికులు గమనించారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు.. స్థానిక రెవెన్యూ అధికారులు సమక్షంలో ఆలయం సమీపంలో తవ్వకాలు జరిపారు. నరసింహస్వామివారి ఆలయానికి అతి సమీపంలోనే గోతిలో పూడ్చిపెట్టిన తల, మొండెం వేర్వేరుగా పాతిపెట్టి ఉండటం సంచలనం రేపుతోంది.

కాగా, గోతిలో పాతిపెట్టిన తలకు, మొండెంకు సంబంధం కూడా లేదని పోలీసులు చెబుతున్నారు. తల, మొండెం రెండూ వేర్వేరు వ్యక్తులకు సంబంధించినవిగా ఉన్నాయని చెబుతున్నారు. అంతేకాదు, డెడ్‌బాడీతో పాటు గోతిలో నిమ్మకాయలు కూడా బయటపడ్డాయి. ఎవరో క్షుద్రపూజలు చేసి ఇద్దరు వ్యక్తులను ఇక్కడ నరబలిగా ఇచ్చారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆ డెడ్‌బాడీ ఎవరనేది తేలుతుందని ఎస్సై చంద్రశేఖర్ రెడ్డి చెప్పారు. అన్ని కోణాల్లో కేసును దర్యాప్తు చేస్తామని.. త్వరలోనే అన్ని విషయాలు బయటపడతాయన్నారు ఎస్సై చంద్రశేఖర్ రెడ్డి.