ఫిబ్ర‌వ‌రి మూడో వారంలో ఎమ్మెల్సీ ఎన్నిక‌లు..?

0
99

ముంద‌స్తు ఎన్నిక‌ల నేప‌థ్యంతో 2018 సంవ‌త్సరానికి తెలంగాణ ప్ర‌జ‌లు ఘ‌న వీడ్కోలు ప‌లికిన సంగ‌తి తెలిసిందే. 2019 ప్రారంభంలోనూ అదే ఎన్నిక‌ల వాతావ‌ర‌ణం కొన‌సాగ‌బోతోంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్నారు. అయితే, ఈ నెల‌ 21వ తేదీన పంచాయ‌తీ ఎన్నిక‌లు నిర్వ‌హిస్తామ‌ని ఎన్నిక‌ల సంఘం ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. అలాగే, మ‌రికొన్ని నెల‌ల్లోనే పార్ల‌మెంట్ స్థానాల‌కూ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఇలా పంచాయ‌తీ, పార్ల‌మెంట్ ఎన్నిక‌ల మ‌ధ్య‌లో ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌ను నిర్వ‌హించేందుకు ఎన్నిక‌ల క‌మిష‌న్‌ ఏర్పాట్ల‌ను ముమ్మ‌రం చేస్తోంద‌ని స‌మాచారం.

అయితే, ప్ర‌స్తుతం తెలంగాణ శాస‌న మండ‌లిలో ఎన‌మిది ఎమ్మెల్సీల‌కు సంబంధించిన ప‌ద‌వీ కాలం మార్చి 29 2019 నాటికి పూర్తి కానుంది. అలాగే ఈ ఏడాది మేలో మ‌రో ఎమ్మెల్సీ ప‌ద‌వీ కాలం పూర్తి కానుంది. అంతేకాకుండా, ఇటీవ‌ల నిర్వ‌హించిన‌ ముంద‌స్తు ఎన్నిక‌ల్లో ముగ్గురు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలుగా పోటీచేసి గెలుపొందిన సంగ‌తి తెలిసిందే. ఇలా మొత్తం 13 శాస‌న మండ‌లి స్థానాల‌కు ఎన్నిక‌లు నిర్వ‌హించేందుకు ఎన్నిక‌ల సంఘం స‌మాయ‌త్త‌మైంద‌న్న‌ది రాజ‌కీయ విశ్లేష‌కుల భావ‌న‌.

ఇదిలా ఉండ‌గా, ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు ముందు తెరాస‌నుంచి ఫిరాయించిన శాస‌న మండ‌లి స‌భ్యులు భూప‌తిరెడ్డి, రాములు నాయ‌క్‌, యాద‌వ‌రెడ్డిల‌పై పార్టీ ఫిరాయింపుల చ‌ట్టం ఆధారంగా చ‌ర్య‌లు తీసుకుంటేగ‌నుక ఆ మూడు స్థానాల‌కూ ఎన్నిక‌లు నిర్వ‌హించే అవ‌కాశం ఉంది. ఇలా మొత్తం తెలంగాణ శాస‌న మండ‌లిలో మొత్తం 16 స్థానాల్లో ఎన్నిక‌లు జ‌రిగే అవ‌కాశం ఉంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు పేర్కొంటున్నారు. మ‌రి రాజ‌కీయ విశ్లేష‌కుల విశ్వ‌స‌నీయ స‌మాచారం మేర‌కు ఎన్నిక‌లు జ‌రుగుతాయో..? లేదో..? అన్న‌ది తెలియాలంటే ఫిబ్ర‌వ‌రి వ‌ర‌కు వెయిట్ చేయ‌క త‌ప్ప‌దుమ‌రీ..!