త్వ‌ర‌లో చంద్ర‌బాబు ఇంటిని తొల‌గిస్తాం : ఎమ్మెల్యే ఆర్‌కే

0
403

ఏపీ అసెంబ్లీ లాబీలో మంగ‌ళ‌గిరి ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి మీడియా ప్ర‌తినిధులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు ఆస‌క్తిక‌ర స‌మాధానాలు చెప్పారు. రాజ‌ధాని అమ‌రావ‌తి ప‌రిధిలో జ‌రుగుతున్న ప‌నులు ఆగిన విష‌యం త‌న‌కు తెలియ‌దని, అందుకు సంబంధించి సంబంధిత కాంట్రాక్ట‌ర్లు బ‌దులివ్వాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ఎమ్మెల్యే ఆర్‌కే అన్నారు.

జ‌రుగులున్న ప‌నుల‌ను ఆప‌డం వెనుకున్న ఆంత‌ర్య‌మేమిటో కాంట్రాక్ట‌ర్లు చెప్పాల‌ని, ప‌నుల నిర్వ‌హ‌ణ‌పై అనుమానాలు ఉంటే ప్ర‌భుత్వాన్ని సంప్ర‌దించాలే త‌ప్ప ప‌నుల‌ను ఆప‌కూడ‌దంటూ సూచించారు. అమ‌రావ‌తి ప‌రిధిలో అభివృద్ధి ప‌నులు చేప‌డుతున్న సీఆర్డీఏ సంస్థ చైర్మ‌న్‌గా సీఎం జ‌గ‌న్ ఉంటార‌ని, అలా అని ఆ పోస్టు త‌న‌కు ఇస్తార‌ని తాను భావించ‌డం లేద‌ని ఆర్‌కే త‌న అభిప్రాయాన్ని మీడియా వేదిక‌గా తెలిపారు.

అమ‌రావ‌తి క‌ర‌క‌ట్ట‌పై వెలిసిన అక్ర‌మ నిర్మాణాల‌పై కోర్టులో కేసు న‌డుస్తుంద‌ని, ఆఖ‌ర‌కు మాజీ సీఎం చంద్ర‌బాబు సైతం క‌ర‌క‌ట్ట‌పై అక్ర‌మంగా నిర్మించిన ఇంటిలోనే నివాసం ఉంటున్నార‌ని, ఆ నివాసాన్ని త్వ‌ర‌లోనే అక్క‌డి నుంచి తొల‌గించ‌నున్నామంటూ ఎమ్మెల్యే ఆర్కే మీడియా ప్ర‌తినిధుల ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం ఇచ్చారు.

ఎమ్మెల్యే ఆర్‌కేకు నారా లోకేష్ అభినంద‌న‌లు..!

ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణారెడ్డికి మాజీ మంత్రి, ఎమ్మెల్సీ నారా లోకేష్ అభినంద‌న‌లు తెలిపారు. ఈ ద‌ఫా జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో భాగంగా మంగ‌ళ‌గిరి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ నుంచి నారా లోకేష్ బ‌రిలో నిల‌వ‌గా, వైసీపీ నుంచి ఆర్‌కే పోటీచేసిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌చార ప‌ర్వంలో ఒక‌రిపై ఒక‌రు రాజ‌కీయ విమ‌ర్శ‌లు చేసుకున్నా విజ‌యం మాత్రం ఆర్‌కేను వ‌రించింది. దీంతో ఎమ్మెల్యేగా రెండోసారి ప్ర‌మాణ స్వీకారం చేసిన ఆర్‌కేకు అసెంబ్లీ లాబీలో ఎదురుప‌డిన నారా లోకేష్ అభినంద‌న‌లు తెలిపారు.