17 నుంచి మూతపడుతున్న మీ సేవ కేంద్రాలు

0
262

ప్రభుత్వ సేవలను ప్రజలకు చేరువచేసేందుకు ఏర్పాటైన మీ సేవ కేంద్రాలు ఇప్పుడు కష్టాలో ఉన్నాయి. కనీస వేతనం అమలు చేయకపోవడంతో మీ సేవ కేంద్రాల నిర్వాహకులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం తో జరిపిన చర్చలు విఫలం కావడం తో చివరకు చేసేదేమీలేక ప్ర‌భుత్వానికి సమ్మె నోటీసులు ఇచ్చారు. ఈ నెల 17 నుంచి మీ సేవ కేంద్రాలను మూసేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

ఈ సమ్మె కొనసాగితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 9వేల మీ సేవ కేంద్రాలు పని చెయ్యవు. కనీస వేతనం, స్కానింగ్ చార్జీలు పెంచడంతో పాటు కార్వీ సంస్థకు చెందిన సర్వర్ కేంద్రాన్ని ప్రత్యేకంగా ఏపీకి కేటాయించాల‌ని మీ సేవ కేంద్ర నిర్వాహకులు డిమాండ్ చేస్తున్నారు. త‌మ డిమాండ్లను పరిష్కరించాల‌ని ప్రభుత్వాన్ని కోరుతున్నా పట్టించుకోవడం లేదు అని నిర్వాహకులు అంటున్నారు.

ప్రభుత్వానికి చెందిన 400 సేవలను ప్రజలు మీ సేవల ద్వారా పొందుతున్నారు. గతంలో ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ పనికైనా ప్రభుత్వ ఆఫీస్ ల చుట్టూ తిర‌గాల్సి వచ్చేది. మీ సేవ కేంద్రాలు ఏర్పాటయ్యాక ప్రజలకు ప్రభుత్వ కార్యాల‌యాల‌కు వెళ్లాల్సిన‌ అవసరం లేకుండా పోయింది. దీంతో మీ సేవా కేంద్రాల‌కు డిమాండ్ బాగా పెరిగింది. పట్టణాలు, నగరాలు, పంచాయ‌తీ కేంద్రాల వరకు మీ సేవ కేంద్రాలు విస్తరించారు. వీటివల్ల‌ ప్రభుత్వా నికి ఒత్తిడి కూడా త‌గ్గింది.. చిన్న చిన్న పనులు అన్నీ కూడా మీ సేవా కేంద్రాల్లోనే పరిష్కరించే వీలు కలిగింది. అయితే నిర్వహణ భారంగా మారడంతో సమ్మె తప్ప మరో మార్గం లేదు అని భావించిన మీ సేవా నిర్వాహ‌కులు ఈ నెల 17 నుంచి స‌మ్మెకు పిలుపునిచ్చారు.