దూడ‌ను అమ్మినందుకు గుండు కొట్టించారు..!

0
206

దూడ‌ను దొంగ‌త‌నంగా తీసుకెళ్లి సంత‌లో అమ్మేశాడ‌నే నెపంతో ఇద్ద‌రు యువ‌కుల‌కు ఓ గ్రామ స‌ర్పంచ్ గుండు గీయించాడు. దీంతో మ‌న‌స్తాపం చెందిన ఆ ఇద్ద‌రు యువ‌కుల్లో ఒక‌రు పురుగుల‌మందు తాగి ఆత్మ‌హ‌త్యాయ‌త్నానికి పాల్ప‌డ్డారు. ఈ ఘ‌ట‌న మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లా చిన్న‌చిర‌త‌కుంట‌ మండ‌లం ముచ్చింత‌ల‌ గ్రామంలో చోటు చేసుకుంది.

కాగా, ఇంటి ముందు క‌ట్టేసిన గేదె దూడ‌ను మ‌హేశ్వ‌ర్‌రెడ్డి, త‌న స్నేహితుడు రాజేంద్ర సాయంతో సంత‌లో విక్ర‌యించాడు. ఇంత‌లో దూడ క‌నిపించ‌క‌పోవ‌డంతో మ‌హేశ్వ‌ర్‌రెడ్డిని అత‌ని త‌ల్లిదండ్రులు నిల‌దీయగా అస‌లు విష‌యం బ‌య‌ట‌కొచ్చింది. దీంతో ఆగ్ర‌హించిన త‌ల్లిదండ్రులు ఈ విష‌యాన్ని గ్రామ స‌ర్పంచ్‌తోపాటు గ్రామ పెద్ద‌ల‌కు కూడా చెప్పారు.

మ‌హేశ్వ‌ర్‌రెడ్డి,రాజేంద్ర చేసిన ఈ ప‌నిని భ‌విష్య‌త్తులో మ‌రెవ్వ‌రు కూడా చేయ‌కుండా ఉండాలంటే వారిద్ద‌రికి గుండు గీయించి గ్రామంలో ఊరేగించాలంటూ గ్రామ పెద్ద‌లు తీర్పు చెప్పారు. గ్రామ పెద్ద‌ల నిర్ణ‌యానికి ఇద్ద‌రు యువ‌కుల్లో ఒక‌రైన రాజేంద్ర వ్య‌తిరేకించాడు.

మ‌హేశ్వ‌ర్‌రెడ్డి తోడు ర‌మ్మంటేనే వెళ్లాన‌ని, తోడు వెళ్లినందుకే త‌న‌కు గుండు గీయిస్తారా…? అంటూ రాజేంద్ర గ్రామ పెద్ద‌ల‌తో వాగ్వాదానికి దిగాడు. అయినా గ్రామ పెద్ద‌లు విన‌కుండా మ‌హేశ్వ‌ర్‌రెడ్డి,రాజేంద్ర‌కు గుండు గీయించారు. దీంతో రాజేంద్ర అవ‌మానాన్ని భ‌రించ‌లేక ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేశాడు. విష‌యం తెలుసుకున్న స్థానికులు రాజేంద్ర‌ను చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రిలో చేర్పించారు.