‘రైతు స‌ద‌స్సు’లో గొడ‌వ‌..!

0
208

ప్ర‌కాశం జిల్లా కొండెపిలో ఏర్పాటు చేసిన రైతు స‌ద‌స్సు కార్య‌క్ర‌మంలో ఉద్రిక్త‌త చోటు చేసుకుంది. కాగా, దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి జ‌యంతిని పుర‌స్క‌రించుకుని ఏపీ అధికార‌పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆధ్వ‌ర్యంలో ఆ పార్టీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా రైతు స‌ద‌స్సులు నిర్వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే.

అందులో భాగంగా ప్ర‌కాశం జిల్లా కొండెపిలోనూ రైతు స‌ద‌స్సు నిర్వ‌హించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. అయితే స్థానికంగా గెలుపొందిన ఎమ్మెల్యే టీడీపీ కావ‌డంతో ప్రొటోకాల్ ప్ర‌కారం అధికారులు ఎమ్మెల్యే స్వామికి కార్య‌క్ర‌మంలో పాల్గొనాల్సిందిగా ఆహ్వానం పంపారు.

రైతు స‌ద‌స్సులో పాల్గొనేందుకు భారీ సంఖ్య‌లో వ‌చ్చిన వైసీపీ కార్య‌క‌ర్త‌లు ఎమ్మెల్యే స్వామిని అడ్డుకున్నారు. స్వామి రైతు స‌ద‌స్సులో పాల్గొనేందుకు వీలు లేదంటూ వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మ‌రోప‌క్క‌, అధికారుల ఆహ్వానం మేర‌కు, ప్రోటోకాల్ ప్ర‌కారం తాను కార్య‌క్ర‌మంలో పాల్గొనేందుకు వ‌చ్చాన‌ని చెప్తూ వైసీపీ శ్రేణుల వ్య‌తిరేక నినాదాల‌కు నిర‌స‌న‌గా ఆయ‌న దాదాపు గంట‌పాటు రోడ్డుపై బైఠాయించారు. దీంతో కొండెపిలో టీడీపీ, వైసీపీ శ్రేణుల మ‌ధ్య తోపులాట‌తో ఉద్రిక్త ప‌రిస్థితులు కొన‌సాగుతున్నాయి.