ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి చెప్పిన విధంగా ఇంటింటికీ రేషన్ కార్యక్రమాన్ని సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ప్రభుత్వం ప్రారంభించనుందని రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి కొడాలి నాని తెలిపారు. ఈ రోజు జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా కొడాలి నాని మాట్లాడుతూ ఇంటింటికీ రేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించనున్న జిల్లాల్లో రేషన్ డీలర్లను స్టాకిస్టులుగా ఉపయోగించుకుంటామన్నారు.
గతంలో మాదిరి ప్రజలు రేషన్ షాపులకు వచ్చి సరుకులను తీసుకెళ్లే విధంగా కాకుండా, ప్రభుత్వం నియమించిన వాలెంటీర్లే రేషన్ సరుకులను ప్రజల ఇళ్లకు చేరుస్తారని మంత్రి కొడాలి నాని క్లారిటీ ఇచ్చారు. గత టీడీపీ ప్రభుత్వం 2014 నుంచి 2019 మధ్యలో దాదాపు 10వేల మంది రేషన్ డీలర్లను తొలగించారన్నారు. ఆఖరకు గుడివాడలోని 42 మంది రేషన్ డీలర్లను తప్పుకోవాలంటూ గత టీడీపీ ప్రభుత్వం బెదిరించిందని, వారు తప్పుకోకుంటే లేనిపోని క్రిమినల్ కేసులుపెట్టి మరీ అరెస్టులు చేయించిన విషయాన్ని కొడాలి నాని గుర్తు చేశారు.