ప‌వ‌న్ క‌ళ్యాణే సీఎం..!?

0
108

ఈ నెల 23న ఫ‌లితాలు వెలువ‌డిన వెంట‌నే మా పార్టీ అధికారంలోకి రావ‌డం ఖాయం, మా పార్టీ అధినేత‌నే ముఖ్య‌మంత్రి బాధ్య‌త‌లు చేప‌డ‌తారు అంటూ ఏపీ ప్ర‌ధాన పార్ఠీలు వైఎస్ఆర్ కాంగ్రెస్‌, తెలుగుదేశం శ్రేణులు చెప్ప‌డంతోపాటు, అందుకు త‌గ్గ ఆధారాలు కూడా త‌మ వ‌ద్ద ఉన్నాయంటూ ప‌లు కార‌ణాలు చెబుతున్న సంగ‌తి తెలిసిందే.

ఇలా అధికారం త‌మ‌దేన‌న్న చ‌ర్చ‌లో ఇప్పటి వ‌ర‌కు క‌నిపించ‌ని మూడో పార్టీ జ‌న‌సేన తాజాగా తెర‌పైకి వ‌చ్చింది. ఎన్నిక‌ల ఫ‌లితాలు టీడీపీ, వైసీపీ రెండు పార్టీల‌కు అధికారాన్ని క‌ట్ట‌బెట్ట‌వ‌ని, అలా ఆ పార్టీల‌కు అధికారం ద‌క్కాలంటే జ‌న‌సేన మ‌ద్ద‌తు తీసుకోవాల్సిందేనంటూ ఆ పార్టీ శ్రేణులు ధీమాగా చెబుతున్నారు. ఆ రెండు పార్టీలు చూపిన‌ట్టుగానే, జ‌న‌సేన శ్రేణులు సైతం ప‌లు ఆధారాల‌ను చెప్పుకొస్తున్నారు.

జ‌నసేన సీనియ‌ర్ నేత‌ల విశ్లేష‌ణ‌ల మేర‌కు ఆ పార్టీ ఏపీ వ్యాప్తంగా 20 నుంచి 30 అసెంబ్లీ స్థానాల‌ను గెలుపొంద‌నుంద‌ని చెబుతున్నారు. ఇక ప‌వ‌న్ క‌ళ్యాణ్ విష‌యానికొస్తే, భీమ‌వ‌రంతోపాటు, గాజువాక‌లోను జ‌న‌సేన‌ ఘ‌న విజ‌యం సాధించ‌బోతుంద‌ని వారు పేర్కొంటున్నారు. అలాగే గోదావ‌రి జిల్లాల‌తోపాటు, మ‌రికొన్ని జిల్లాల్లో జ‌న‌సేన అభ్య‌ర్ధులు ఎక్కువ సంఖ్య‌లో గెలవ‌నున్నార‌న్న ధీమాను ఆ పార్టీ శ్రేణులు వ్య‌క్తం చేస్తున్నారు.

ఇలా ఏపీలో 30 వ‌ర‌కు అసెంబ్లీ స్థానాల‌ను గెలుపొంద‌నున్న జ‌న‌సేన మ‌ద్ద‌తుతోనే టీడీపీ కానీ, వైసీపీకానీ అధికారంలోకి వ‌స్తుంద‌ని, అలాంటి ప‌రిస్థితే వ‌స్తే జ‌న‌సేన కింగ్ మేక‌ర్ అవ‌డ‌మే కాకుండా, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కింగ్ అయ్యే అవ‌కాశాలు మెండుగా ఉన్నాయంటూ క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల ఉదంతాన్ని రాజ‌కీయ విశ్లేష‌కులు గుర్తు చేస్తున్నారు.