నకిలీ యూనివర్సిటీ గుట్టు రట్టు..!

0
119

మీరు వైద్య విద్య పూర్తి చేయ‌క‌పోయినా మీ పేరు ముంద‌ర డాక్ట‌ర్ అని ఉండాల‌ని అనుకుంటున్నారా.? నేనూ డాక్ట‌ర్‌నే నంటూ స‌ర్టిఫికేట్లు చూపుతూ స‌మాజంలో గౌర‌వం పొందాల‌నుకుంటున్నారా..? డాక్ట‌ర్ అయితే చాలురా.. లైఫ్ లాంగ్ జ‌ల్సా జీవితాన్ని గ‌డిపేయొచ్చు అనే ఆలోచ‌న‌తో ఉన్నారా..? అయితే ఇంకెందుకు ఆల‌స్యం నా వ‌ద్ద‌కు రండి. మీకు ఏ వైద్య వృత్తిలో నైపుణ్యం ఉన్న‌ట్టు స‌ర్టిఫికేట్ కావాలో వెంట‌నే ఇచ్చేస్తా..! అంటూ న‌కిలీ స‌ర్టిఫికేట్‌ల‌ను త‌యారు చేస్తున్న ఓ వ్య‌క్తి గుట్టును పోలీసులు ర‌ట్టు చేశారు. ఈ సంఘ‌ట‌న త‌మిళ‌నాడులోని నాగ‌ప‌ట్నంలో చోటు చేసుకుంది.

సంఘ‌ట‌న‌కు సంబంధించి పోలీసులు తెలిపిన వివ‌రాలిలా ఉన్నాయి.. సెల్వ‌రాజ్ అనే వ్య‌క్తి నాగపట్నంలోని తన ఇంటిలోనే వైద్య కోర్సుల పేరుతో నేషనల్ బోర్డ్ ఆఫ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ యూవర్సిటీ పేరుతో న‌కిలీ స‌ర్టిఫికేట్ల‌ను త‌యారు చేస్తున్నాడ‌ని చెప్పారు. అలా త‌యారు చేసిన న‌కిలీ స‌ర్టిఫికేట్ల‌నే ఇప్ప‌టి వ‌ర‌కు దాదాపు వెయ్యి మందికి పైగా ఒక్కొక్క‌రికి రూ.2 ల‌క్ష‌ల వంతున‌ స‌ర్టిఫికేట్ల‌ను అమ్మాడ‌న్న విష‌యం త‌మ విచార‌ణ‌లో వెల్ల‌డైంద‌ని పోలీసులు తెలిపారు.

సెల్వ‌రాజ్ న‌కిలీ స‌ర్టిఫికేట్‌ల భాగోతం అక్క‌డితో ఆగ‌లేద‌ని, బ‌య‌ట న‌కిలీ మెడిక‌ల్ స‌ర్టిఫికేట్‌ల‌తో వైద్యులుగా చెలామ‌ణి అవుతున్న వారిని బెదిరించి భారీ మొత్తంలో న‌గ‌దును వ‌సూలు చేసేవాడ‌ని పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండ‌గా సోష‌ల్ మీడియాలో ఈ క‌థ‌నాన్ని చ‌దివిన నెటిజ‌న్లు సెల్వ‌రాజ‌న్‌లా న‌కిలీ స‌ర్టిఫికేట్‌ల‌ను చెలామ‌ణి చేసే వారు త‌మిళ‌నాడు వ్యాప్తంగా చాలామందే ఉన్నార‌ని, పోలీసులు వారి గుట్టునూ.. ర‌ట్టు చేయాల‌ని కోరుతున్నారు.