ఫేస్‌యాప్ వాడుతున్నారా..? అయితే మీ ఫోన్‌లోని సీక్రెట్స్ బ‌య‌టప‌డ్డ‌ట్టే..!

0
499

టెక్నాల‌జీ వినియోగంతో ఎన్ని ప్ర‌యోజ‌నాలు ఉన్నాయో.. అంతే స్థాయిలో ప్ర‌మాద‌క‌ర ప‌రిస్థితులు కూడా త‌లెత్తనున్నాయ‌న్న‌ది జ‌గ‌మెరిగిన స‌త్యం. అందులోను డేటా చోరీ హ్యాక‌ర్ల‌కు ఈ ప్ర‌పంచంలో కొద‌వ‌లేదు. పెరుగుతున్న టెక్నాల‌జీ యుగంలో తాజాగా ట్రెండింగ్‌లో ఉన్న యాప్ ఫేస్ యాప్‌.

20 ఏళ్ల కుర్రాడు వృద్డుడైతే ఎలా ఉంటాడు..? 60 ఏళ్ల వృద్ధుడు 20 ఏళ్ల కుర్రాడిలా మారితే ఎలా ఉంటాడు..? అన్న ప్ర‌శ్న‌ల‌కు ఫోటోతో స‌హా ఈ యాప్ స‌మాధానం చెప్పేస్తుంది. ప్ర‌స్తుతం ఈ యాప్‌ను వినియోగిస్తున్న సోష‌ల్ మీడియా ప్రేమికుల‌కు కొద‌వ‌లేదు. ఇంత‌లా వైర‌ల్ అయిన ఈ యాప్‌తో ఎంత ప్ర‌యోజ‌న‌ముందో.. అంత‌కు మించిన ప్ర‌మాదం కూడా ఉంద‌ని ఐటీ నిపుణులు చెబుతున్నారు.

అయితే, ఇటీవ‌ల కాలంలో ఎంతో ముఖ్య‌మైన ధృవీక‌ర‌ణ ప‌త్రాలు, నోటీసుల‌లో ట‌ర్మ్స్ అండ్ కండీష‌న్స్‌ను ఏ మాత్రం చ‌ద‌వ‌కుండా ట‌క్కున టిక్‌మార్క్ పెట్టేస్తున్న సంగ‌తి తెలిసిందే. అదే అలవాటు మ‌నం వాడుతున్న స్మార్ట్‌ఫోన్‌ల‌లో యాప్స్ డౌన్‌లోడ్ విష‌యంలో ఫాలో అయిపోతున్నాం. అలా ట‌ర్మ్స్ అండ్ కండీష‌న్స్‌ను చ‌ద‌వ‌కుండా టిక్‌మార్క్ పెట్ట‌డం ప్ర‌మాద‌క‌ర‌మేనంటూ ఐటీ నిపుణులు ఉదాహ‌ర‌ణ‌ల‌తో స‌హా చెబుతున్నారు.

తాజాగా, ఫేస్ యాప్ గురించి వారి వారి అభిప్రాయాల‌ను చెబుతున్న ఐటీ నిపుణులు ప్ర‌మాదం త‌ప్ప‌ద‌ని హెచ్చ‌రిస్తున్నారు. అందుకు ఉదాహ‌ర‌ణ చెబుతూ తిరుప‌తిలో ఎన్ని కంపార్ట్‌మెంట్స్ ఉన్నాయి..? అని తెలుసుకునేందుకు త‌యారు చేసిన యాప్‌కు కావాల్సిన ప‌ర్మీష‌న్స్ లొకేష‌న్స్ ఎక్క‌డ ఉంది..? ఇంట‌ర్నెట్ ప‌ర్మీష‌న్ ఉందా..? లేదా..? అన్న‌వి మాత్ర‌మే. ఇలా ప్ర‌తి యాప్ వారి వారి ప‌రిధిలోని ప‌ర్మీష‌న్స్‌ను మాత్ర‌మే స్మార్ట్ ఫోన్ల యూజ‌ర్ల‌ను అడుగుతాయి.

కానీ, ఫేస్ యాప్ మాత్రం ఆ అప్లికేష‌న్‌కు అవ‌స‌రం లేకున్నా స్టోరేజ్ ప‌ర్మీష‌న్‌, కాల్‌లాగ్స్ ప‌ర్మీష‌న్‌, కెమెరా ఇలా ప‌ది ప‌ర్మీష‌న్స్‌ను అడుగుతున్న సంగ‌తి తెలిసిందే. ఇవి తెలియ‌ని చాలా మంది టిక్‌మార్క్‌, లేదా అగ్రీ అంటూ యాసెప్ట్ చేస్తూ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుంటున్నారు. కానీ ఆ పొర‌పాటే యూజ‌ర్ల చేస్తున్న పెద్ద త‌ప్ప‌ని, అలా చేస్తే ఫోన్‌లోని సీక్రెట్స్ అన్నీ బ‌య‌ట‌ప‌డ్డ‌ట్టేన‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. త‌స్మాత్ జాగ్ర‌త్త సుమా..!