జ‌గ‌న్ అద‌న‌పు కార్య‌ద‌ర్శి అస‌లు చ‌రిత్ర ఇదే..!

0
430

వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి ఆంధ్రప్ర‌దేశ్ ముఖ్యమంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేసిన వెంట‌నే రాష్ట్రంలోని ప‌లువురు కీల‌క అధికారుల‌పై బ‌దిలీవేలు ప‌డిన సంగ‌తి తెలిసిందే. త‌న‌కు సంబంధించి సొంత టీమ్‌ను ఏర్పాటు చేసుకోవ‌డంలో వైఎస్ జ‌గ‌న్ చాలా చురుగ్గా వ్య‌వ‌హ‌రించారు.

ఆ నేప‌థ్యంలోనే, టీడీపీకి అనుకూలంగా ఉంటున్నారు అంటూ వైసీపీచేత విమర్శ‌లు ఎదుర్కొంటూ వ‌చ్చిన డీజీపీ ఠాకూర్‌ను, ఏసీబీ చీఫ్ ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావుపైన వేటు ప‌డింది. డీజీపీ ఠాకూర్‌ను ప్రింటింగ్ అండ్ స్టేష‌న‌రీ క‌మిష‌న‌ర్‌గా నియ‌మించారు. ఏబీ వెంక‌టేశ్వ‌ర‌రావును పోలీసు హెడ్ క్వార్ట‌ర్స్‌కు పంపించారు.

కొత్త డీజీపీగా గౌతమ్ స‌వాంగ్‌కు బాధ్య‌త‌లు అప్ప‌గించారు. అలాగే ఏసీబీ చీఫ్‌గా విశ్వ‌జిత్‌కు బాధ్య‌త‌లు అప్ప‌గించారు. జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించ‌గానే, అటు సీఎంఓలో అధికారుల ప్ర‌క్షాళ‌న చాలా వేగంగా జ‌రిగింది. మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు టీమ్‌ను మొత్తం బ‌దిలీ చేశారు. కొత్త‌గా సీఎంవో కార్య‌ద‌ర్శిగా ఆరోగ్య‌రాజును నిమించారు. ఆర్థిక‌శాఖ కార్య‌ద‌ర్శిగా ఎస్ఎస్ రావ‌త్‌, సీఎంవో అద‌న‌పు కార్య‌ద‌ర్శిగా ధ‌నుంజ‌యరెడ్డిని జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి నియ‌మించారు.

అయితే, వైసీపీ అధికారంలోకి రాగానే జ‌రిగిన మొట్ట‌మొద‌టి నియామ‌కం కూడా ధ‌నుంజ‌యరెడ్డిదే. ధ‌నుంజ‌య‌రెడ్డి సొంత ఊరు క‌డ‌ప జిల్లా రాయ‌చోటి మండ‌లం హ‌నుముక్క‌ప‌ల్లి. ఈయ‌న ఉద్యోగంలో చేర‌క ముందు గ్రామంలో స‌ర్పంచ్‌గా ప‌నిచేయ‌డం విశేషం. ఫిజిక్స్‌లో పీజీ పూర్తి చేసిన ధ‌నుంజ‌య‌రెడ్డి ఆ త‌రువాత గ్రామంలో సేవ చేసేందుకు ముందుకొచ్చారు.

ఆయ‌న స‌ర్పంచ్‌గా గ్రామానికి సేవ‌లు చేస్తూనే ధ‌నుంజ‌య‌రెడ్డి త‌న చ‌దువును కూడా కొన‌సాగించారు. ఆ త‌రువాత గ్రూప్ – 1 ఉద్యోగాన్ని సాధించారు. డిప్యూటి క‌లెక్ట‌ర్‌గా ఉద్యోగం రావ‌డంతో స‌ర్పంచ్ ప‌ద‌వికి రాజీనామా చేసి ఉద్యోగంలోకి వ‌చ్చేశారు. అప్ప‌టి నుంచి ఆయ‌న అనేక కీల‌క ప‌ద‌వుల్లో విధులు నిర్వ‌హిస్తూ వ‌చ్చారు.