టీఆర్ఎస్‌కు సోమార‌పు స‌త్య‌నారాయ‌ణ రాజీనామా..!

0
201

టీఆర్ఎస్ నేత, ఆర్టీసీ మాజీ చైర్మ‌న్ సోమార‌పు స‌త్య‌నారాయ‌ణ కాసేప‌టి క్రితం పార్టీకి రాజీనామా చేశారు. మీడియాతో మాట్లాడిన ఆయ‌న పార్టీలో గౌర‌వం లేన‌ప్పుడు ప‌నిచేయ‌డం క‌ష్ట‌మ‌ని, పార్టీలో క్ర‌మ‌శిక్ష‌ణ లోపించింద‌ని, అతి త్వ‌ర‌లో త‌న భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ ప్ర‌క‌టిస్తానంటూ సోమార‌పు స‌త్య‌నారాయ‌ణ తెలిపారు.

2014 ఎన్నిక‌ల్లో రామ‌గుండం స్వ‌తంత్ర ఎమ్మెల్యే అభ్య‌ర్ధిగా గెలుపొందిన సోమార‌పు స‌త్య‌నారాయ‌ణ టీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకున్న సంగ‌తి తెలిసిందే. అయితే గ‌త ఏడాది డిసెంబ‌ర్‌లో జ‌రిగిన ముంద‌స్తు అసెంబ్లీ ఎన్నిక‌ల్లో రామ‌గుండం స్వ‌తంత్ర అభ్య‌ర్ధి కోరుకంటి చంద‌ర్‌పై ఓట‌మిపాల‌య్యారు.

రామ‌గుండం ఎమ్మెల్యేగా గెలుపొందిన స్వ‌తంత్ర అభ్య‌ర్ధి కోరుకంటి చంద‌ర్ టీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకున్నారు. దీంతో ఇద్ద‌రి మ‌ధ్య విభేదాలు, బేధాభిప్రాయాలు వ‌చ్చిన‌ట్టు స‌మాచారం. గ‌త నెల 25న ప్రారంభ‌మైన టీఆర్ఎస్ స‌భ్య‌త్వ న‌మోదు కార్య‌క్ర‌మంలో త‌న‌కు, త‌న అనుచ‌రుల‌కు భాగ‌స్వామ్యం క‌ల్పించ‌లేదంటూ సోమార‌పు స‌త్య‌నారాయ‌ణ మీడియా స‌మావేశంలో విమ‌ర్శించారు. అంతేకాకుండా రామ‌గుండంలో త‌న ఓట‌మికి ప్ర‌ధాన కార‌ణం ఎమ్మెల్యే బాల్క సుమ‌న్‌తోపాటు మ‌రికొంద మంది టీఆర్ఎస్ ప్ర‌ధాన నేత‌లు ఉన్నారంటూ సోమార‌పు స‌త్య‌నారాయ‌ణ చెప్ప‌డం గ‌మ‌నార్హం.