ఎన్నికల కమిషన్‌ ప్రాధమిక బాధ్య‌త‌..!

0
33

మరో నాలుగు నెలల్లో సార్వత్రిక ఎన్నికలు రానున్నాయి.ప్రజాస్వామ్యంలో ముఖ్య ఘట్టం అది.ప్రజలే ప్రభువులన్న స్ఫూర్తికి దర్పణం ఎన్నికల ప్రక్రియ.ఆ ప్రక్రియ ఎంత లోప‌రహితంగా జరిగితే వ్యవస్థకు అంత మేలు అన్నది సదా గమనంలో ఉంచుకొని ప్రభుత్వం, రాజ్యాంగ సంస్థలు ఆ దిశగా తప్పుల్ని, పొరపాట్లని సవరించుకు వెళ్ళాలి. తాజాగా ముగిసిన ఐదు అసెంబ్లీ ఎన్నికల్ని ప్రశాంతంగా, సమర్ధవంతంగా ఎన్నికల కమిషన్‌ నిర్వహించింది. అయితే ఓటర్ల లిస్టు సిద్ధం చేసే విషయంలో మాత్రం తప్పులు పునరావ తమయ్యాయి.

తెలంగాణా లో 22 లక్షల మంది పేర్ల గల్లంతు అన్నది తీవ్ర తప్పిదం. గెలుపుకీ, ఓటమికి ఒక్క ఓటు తేడా చాలు అనే ప్రజాస్వామ్య రీతి కి అంత పెద్ద సంఖ్యలో ప్రజలు ఓటు హక్కుని కోల్పోవడమంటే అన్యాయమే. ఈ విషయంలో అక్కడి ఎలక్షన్‌ ముఖ్యాధికారి సారీ చెప్పినా,ఫలితం ఏముంది ఎన్నికల సంస్కరణల కోసం కమిషన్‌ నిజంగా కట్టుబడితే మొదట చెయ్యాల్సిన ప్రాధమిక చర్య తప్పులూ,తడకలూ లేని ఓటర్‌ లిస్టు ప్రిపేర్‌ చెయ్యడం.

దొంగ ఓట్లు తొలగించడం ఎంత ముఖ్యవెూ,అర్హులందరికీ ఆ హక్కు అందించడం అంతే ముఖ్యం.ఎలాగూ ఏడాది పొడుగునా నవెూదుకు అవకాశం ఉంది. ఓటు తో ఆధార్‌ లింక చేయాలన్నది మంచి సూచన.గతంలో అలా చేసినా వ్యక్తిగత గోప్యత కోణంలో ఆ ప్రక్రియని నిలుపుదల చేసింది. న్యాయ శాఖతో సంప్రదించి మళ్ళీ లింకింగ్‌ ప్రక్రియ ని విస్త త పరిస్తే దొంగ ఓట్లు,డూప్లికేట్‌ ఓట్లు బెడద తగ్గుతుంది. మున్ముందు అంతర్జాల ఓటింగుకీ, ప్రవాసుల ప్రాక్సీ ఓటింగ్‌ తరహా సంస్కరణలకు ఉపయోగ పడుతుంది. ఆ దిశగా చర్యలు చేపట్టాలి.

ఇక అర్హులకు లిస్టులో పేరు లేదన్న సాకుతో హక్కు తిరస్కరించడం కూడా అన్యాయమే.ఏదైనా గుర్తింపు పత్రం చూపిస్తే ఎన్నికల రోజు చివరి నిముషంలో నైనా అర్హుడు ఓటు వెయ్యగలిగేలా వ్యవస్థని తీర్చిదిద్దుకోవాలి.ఆ దిశగా రానున్న ఎన్నికల్లోనే గుణాత్మక మార్పులు తీసుకు రాగలిగితే అది ప్రజాస్వామ్య విజయం కాగలదు. కష్టమే గానీ, సాధ్యమే ఐన ప్రాధమిక స్థాయి సంస్కరణ ఇది.