జ‌న‌సేన‌కు పెరిగిన డిమాండ్‌..!

0
225

ఎన్నిక‌ల‌కు స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డుతున్న‌కొద్దీ ఏపీలో రాజ‌కీయ ఎత్తుగ‌డ‌లు ముమ్మ‌ర‌మ‌య్యాయి. ఒక్కోపార్టీ ఒక్కో స్ట్రాట‌జీని ఫాలో అవుతున్నాయి. అధికారంలో ఉన్న టీడీపీ ఇప్ప‌టికే ఉప్పు, నిప్పులా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను క‌లిసిరావాల‌ని ఓపెన్ ఆఫ‌ర్ ఇచ్చేసింది. అయితే, 2014 ఎన్నిక‌ల్లో కూట‌మిగా క‌లిసి ప‌నిచేసిన టీడీపీ, బీజేపీ, జ‌న‌సేన ప్ర‌స్తుతం త‌లోదారి అయిన సంగ‌తి తెలిసిందే. దీంతో వైసీపీ, టీడీపీ, జ‌న‌సేన ఈ మూడు పార్టీలు కూడా ఒక‌దానిపై మ‌రొక‌టి దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. ఈ స‌మ‌యంలో ప‌వ‌న్‌ను ఉద్దేశించి వ‌రుస‌గా రెండు రోజులు చంద్ర‌బాబు చేసిన వ్యాఖ్య‌లు పొలిటిక‌ల్ హీట్‌ను పెంచాయి.

ఏపీలో ప్ర‌స్తుతం ఉన్న పార్టీలు టీడీపీ, వైసీపీ, బీజేపీ, సీపీఐ, సీపీఎం అయితే సీపీఎం, సీపీఐ, జ‌న‌సేన క‌లిసి కొన్ని కార్య‌క్ర‌మాలు చేస్తుండ‌గా, మిగిలిన పార్టీలు వేటిక‌వే ఎన్నిక‌ల ఏర్పాట్ల‌లో ఉన్నాయి. అయిన‌ప్ప‌టికీ జ‌న‌సేన‌, వైసీపీ పొత్తు కుదురుతుంద‌న్న వార్త‌లు అడ‌పా ద‌డ‌పా వ‌స్తూనే ఉన్న సంగ‌తి విధిత‌మే. ఈ ప్ర‌చారాన్ని ఈ రెండు పార్టీలు ఖండించ‌క‌పోవ‌డం వ‌ల్లే ఎన్నిక‌ల నాటికి ఏదో జ‌రుగుతుంద‌న్న అనుమానాలు రాజ‌కీయ వ‌ర్గాల్లో ఉన్నాయి.

ఈ ప‌రిస్థితుల్లో వ‌ద్ద‌ని వ‌దిలేసిపోయి ప్ర‌భుత్వంపైన‌, ప్ర‌భుత్వ అధినేత‌పైనా తీవ్ర ఆరోప‌ణ‌లు చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను క‌లిసిరావాల‌ని చంద్ర‌బాబు కోర‌డం రాజ‌కీయ వ‌ర్గాల‌ను ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. చంద్ర‌బాబు చాణుక్యం ప్ర‌ద‌ర్శించార‌ని మోడీ వ్య‌తిరేక‌త పేరుతో ప‌వ‌ణ్ క‌ళ్యాణ్‌తో పాత సంబంధాల‌ను పున‌రుద్ధ‌రించుకునే ప‌నిలో ప‌డ్డార‌ని అంతా అనుకున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఒంట‌రిగా ఏ ఎన్నిక‌ల‌కు వెళ్ల‌ని చంద్ర‌బాబు నేతృత్వంలోని టీడీపీ ప‌వ‌న్‌ను క‌లుపుకుని మ‌ళ్లీ ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌నే ఆలోచ‌న వ్యూహాత్మ‌కంగానే చేశార‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్నారు.

మొద‌ట ఈ వ్య‌వ‌హారాన్ని లైట్‌గా తీసుకున్న జ‌న‌సేన ఆ త‌రువాత ఆలోచ‌న‌ల్లో ప‌డింది. చంద్ర‌బాబుతో త‌మ‌ను అంట‌గ‌డుతూ వైసీపీ చేస్తున్న వ్యాఖ్య‌లు జ‌న‌సేన విశ్వ‌స‌నీయ‌త‌ను దెబ్బ‌తీస్తున్నాయ‌ని గ్ర‌హించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్ రంగంలోకి దిగి ఒంట‌రిపోరేనంటూ వివ‌రణ ఇచ్చుకోవాల్సి వ‌చ్చింది. ఈ పొత్తు రాజ‌కీయాల‌కు ఇంత‌టితో తెర‌ప‌డుతుందా..? లేక మ‌రెన్ని మ‌లుపులు తీసుకుంటుందో చూడాలి.