వైసీపీలోకి బీజేపీ కీల‌క నాయ‌కురాలు..!

0
777

ఒక ప‌క్క ఏపీ సార్వ‌త్రిక ఎన్నిక‌ల ఫ‌లితాల కోసం పోటీచేసిన ఎంపీ, ఎమ్మెల్యే అభ్య‌ర్ధులతోపాటు ప్ర‌జ‌లు కూడా ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తుంటే..మ‌రోప‌క్క గెలుపొందే పార్టీ ఏదో అన్న ప్ర‌శ్న‌కు సంబంధించి ఇప్ప‌టికే ఓ అంచ‌నాకు వ‌చ్చిన కొంద‌రు రాజ‌కీయ నాయ‌కులు ఆ పార్టీలో చేరిపోయేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.

అయితే, సార్వ‌త్రిక ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ రాక ముందు.. వ‌చ్చిన త‌రువాత ప‌లు పార్టీల నుంచి సీనియ‌ర్ రాజ‌కీయ నేత‌లు, టాలీవుడ్ ప్ర‌ముఖులు వైఎస్ జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్న సంగ‌తి తెలిసిందే. పోలింగ్‌కు ముందు ముగిసిన వైసీపీలోకి చేరిక‌లు, కౌంటింగ్‌కు ముందు మ‌ళ్లీ షురూ కానున్నాయ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్నారు.

ఇక అస‌లు విష‌యానికొస్తే, ద‌గ్గుబాటి కుటుంబానికి ప్ర‌కాశం జిల్లాలో రాజ‌కీయంగా మాంచి ప‌ట్టు ఉన్న సంగ‌తి తెలిసిందే. అలాగే దివంగ‌త ముఖ్య‌మంత్రి నంద‌మూరి తాక‌ర రామారావు కుమార్తె పురందేశ్వ‌రి సైతం రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇవ్వ‌డ‌మే కాకుండా కేంద్ర స్థాయిలో మంత్రి ప‌ద‌వుల‌ను అనుభ‌వించి త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపును సాధించారు.

దివంగ‌త సీఎం వైఎస్ఆర్ హ‌యాంలో కేంద్రంలోని కాంగ్రెస్ ప్ర‌భుత్వంలో పురందేశ్వ‌రి మంత్రి ప‌ద‌వుల‌ను అనుభ‌వించారు. రాష్ట్ర విభ‌జ‌న ప‌రిస్థితుల నేప‌థ్యంలో కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన‌ ఆమె బీజేపీలో చేరారు. ఆమె భ‌ర్త ద‌గ్గుబాటి వెంక‌టేశ్వ‌ర‌రావు ఏప్రిల్ 11న జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో వైసీపీ నుంచి ప‌రుచూరు అభ్య‌ర్ధిగా ఎన్నిక‌ల బ‌రిలో నిలిచారు. కానీ, పురందేశ్వ‌రి మాత్రం భార‌తీయ జ‌న‌తా పార్టీలోనే ఇంకా కొన‌సాగుతున్నారు.

ఇదిలా ఉండ‌గా, ముగిసిన ఏపీ సార్వ‌త్రిక ఎన్నిక‌ల పోలింగ్ దృష్ట్యా వైసీపీ అధికారంలోకి రానుంద‌ని ఇప్ప‌టికే ప‌లువురు రాజ‌కీయ విశ్లేష‌కులు అంచ‌నాలు వేశారు. ఎలాగో పురందేశ్వ‌రి భ‌ర్త ఇప్ప‌టికే వైసీపీలో ఉన్నారు క‌నుక ఆమెకూడా అతి త్వ‌ర‌లో జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసీపీ తీర్ధం పుచ్చుకునే అవ‌కాశాలు మెండుగా ఉన్నాయ‌ని రాజ‌కీయ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి.