త్వరలో తెలంగాణ వ్యాప్తంగా జరగనున్న పరిషత్ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచిన అభ్యర్ధులు పార్టీని వీడకుండా ఉండేలా ఆ పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరించబోతోందంటూ ఓ టాక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నల్గొండ, భువనగిరి, సూర్యాపేట్ జడ్పీచైర్మన్ స్థానాలను కైవసం చేసుకునేందుకు ఆ పార్టీ నాయకులు ఎంతో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.
ఇప్పటికే బలమైన నేతలను గుర్తించిన కాంగ్రెస్ మూడు జడ్పీ చైర్మన్ స్థానాలను గెలుపొందేందుకు రంగం సిద్ధం చేసుకుంది. అయితే, పరిషత్ ఎన్నికల్లో గెలిచిన తరువాత కాంగ్రెస్ నుంచి ఫిరాయించకుండా బీఫామ్ ఇచ్చే ముందే పార్టీ మారకుండా బాండ్ పేపర్ రాయించుకుని అఫిడవిట్ కోరేందుకు కాంగ్రెస్ నేతలు సమాయత్తమయ్యారు.
కాంగ్రెస్ నుంచి గెలిచిన తరువాత పార్టీని వీడబోమని ప్రమాణం చేయించుకుంటున్నారట.ఈ ప్రాసెస్ మొత్తం వీడియో తీసి పెట్టుకుంటామని, ఒక వేళ కాంగ్రెస్ నుంచి గెలిచి టీఆర్ఎస్లోకి వెళితే అలాంటి వారిపై చట్టపరంగా కోర్టులో పోరాటం చేయాలనే ఆలోచనలో కాంగ్రెస్ ఉన్నట్టు సమాచారం.